యాపిల్ తోటలో ఉగ్రవాదుల ఘాతుకం... కశ్మీరీ పండిట్ కాల్చివేత

  • కూలీలను వరుస క్రమంలో నిలబెట్టి వివరాలు అడిగి తెలుసుకున్న ఉగ్రవాదులు
  • ఇద్దరు కశ్మీరీ పండిట్లను గుర్తించి పక్కకు తీసుకెళ్లి కాల్పులు
  • తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి
  • ఉగ్రదాడుల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 21 మంది మృతి
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోఫియా జిల్లాలో నిన్న జరిగిందీ ఘటన. కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకున్న అల్ బదర్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు యాపిల్ తోటలోకి వెళ్లి అక్కడ పనిచేస్తున్న కూలీలను వరుసగా నిలబెట్టారు. వారందరి వివరాలను కనుక్కున్నారు. 

అందులో సునీల్ కుమార్ భట్, అతడి సోదరుడు (కజిన్) ప్రితంబర్ కుమార్ భట్‌లను కశ్మీరీ పండిట్లగా గుర్తించి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం వారిద్దరిపైనా తుపాకితో కాల్పులు జరిపారు. ఈ ఘటనను ఓ ఉగ్రవాది తన సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. 

అక్కడ సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోగా, ప్రితంబర్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కశ్మీరీ పండిట్ కాల్చివేత ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు ఉగ్రవాదుల లక్షిత దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 21కి పెరిగింది.


More Telugu News