చిట్టీలు కట్టించుకుని ఎగవేత.. నిర్వాహకుడి కుమారుడిని పట్టుకుని కృష్ణా నదిలో ముంచేందుకు బాధితుల యత్నం

  • గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఘటన
  • నిందితుడి ఇంటిని ముట్టడించి ధ్వంసం చేసిన బాధితులు
  • అతడి కుమారుడిని కృష్ణా నది వద్దకు తీసుకెళ్లిన వైనం
  • పోలీసులు సకాలంలో చేరుకుని విడిపించి తల్లిదండ్రులకు అప్పగింత
  • ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
చిట్టీలు కట్టించుకుని మోసం చేసి పరారైన వ్యక్తి.. బాధితుల కోపం చల్లారి ఉంటుందని భావించి కుటుంబంతో సహా తాజాగా ఊర్లో అడుగుపెట్టాడు. అయితే, ఆగ్రహంతో ఊగిపోతున్న బాధితులు వారిని చూడగానే రెచ్చిపోయారు. మోసం చేసిన వ్యక్తి కుమారుడిని పట్టుకుని కృష్ణానదిలో ముంచేందుకు ప్రయత్నించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామస్థులతో చిట్టీలు కట్టించుకున్న పుట్టా వెంకటేశ్వరరావు బోర్డు తిప్పేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. చాలా రోజుల తర్వాత సోమవారం కుటుంబంతో సహా తిరిగి గ్రామంలో అడుగుపెట్టాడు. విషయం తెలిసిన బాధితులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం ఆయన చిన్నకుమారుడు శ్రీనును వెంట తీసుకెళ్లారు. దీంతో కంగారుపడిన వెంకటేశ్వరరావు తన కుమారుడిని కిడ్నాప్ చేశారని, కృష్ణా నదిలో అతడిని ముంచే ప్రమాదం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్పందించిన పోలీసులు వెంకటేశ్వరరావు కుమారుడిని తీసుకెళ్లిన వారి ఫోన్ల ఆధారంగా వారు శ్రీనును కృష్ణా నది వద్దకు తీసుకెళ్లినట్టు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. బాధితులు శ్రీనును అప్పటికే నదిలో నిలబెట్టడంతో అతడిని విడిపించి తీసుకెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్రీనును అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాగే, వెంకటేశ్వరరావు ఇంటిని ముట్టడించి ధ్వంసం చేయడం, అతడి కుమారుడిని కిడ్నాప్ చేయడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

దీంతో బాధితులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డబ్బులు కాజేసిన వ్యక్తిపై కాకుండా బాధితులమైన తమపైనే కేసులు పెడతారా? అని ప్రశ్నిస్తూ నిన్న మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే, ఈ వ్యవహారం కోర్టులో ఉందని, కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని పోలీసులు సూచించారు. గతేడాది డిసెంబరులోనే వెంకటేశ్వరరావుపై కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


More Telugu News