తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

  • రేపు ఉదయం 9 గంటల నుంచి అందుబాటులోకి
  • బ్రహ్మోత్సవాల తేదీలను గమనించి బుక్ చేసుకోవాలన్న టీటీడీ
  • బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనానికి మాత్రమే అనుమతి
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. అక్టోబరు నెలకుగాను రేపు (గురువారం) రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అదే నెలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నిలిపివేశారు. కాబట్టి టికెట్లను బుక్ చేసుకునే సమయంలో భక్తులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అధికారులు తెలిపారు.

కాగా, రెండేళ్ల తర్వాత తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తుల మధ్య జరగనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 27న ధ్వజారోహణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అక్టోబర్ 1న గరుడవాహన సేవ, 5న చక్రస్నానం నిర్వహిస్తారు.


More Telugu News