శ్రీలంకకు వచ్చిన చైనా గూఢచార నౌకపై భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?.. కొన్ని కీలక విషయాలు ఇవిగో!

శ్రీలంకకు వచ్చిన చైనా గూఢచార నౌకపై భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?.. కొన్ని కీలక విషయాలు ఇవిగో!
  • చైనా గూఢచార నౌక అత్యంత అధునాతనమైనది
  • మన క్షిపణుల రేంజ్, కచ్చితత్వాలను ట్రాక్ చేస్తుంది
  • ఇందులో అత్యంత శక్తిమంతమైన సెన్సార్లు ఉంటాయి
  • హిందూ మహాసముద్రంలో ఈ నౌక సర్వేలు చేస్తుంది
  • జలాంతర్గాములకు సహకరిస్తుంది
భారత్ ఆందోళనల మధ్యే చైనాకు చెందిన అత్యాధునిక గూఢచార నౌక శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు చేరుకుంది. ఈ నౌక రాకపై భారత్ ముందు నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శ్రీలంక కూడా నౌక రాకను వాయిదా వేసుకోవాలని చైనాను కోరింది. ఈ క్రమంలో, నాటకీయ పరిణామాల మధ్య చైనా గూఢచార నౌక శ్రీలంకకు చేరుకుంది. 

అసలు మన ఆందోళన దేనికి? 

శ్రీలంకకు చేరుకున్న చైనా గూఢచార నౌక యువాంగ్ వాంగ్ 5 అత్యాధునికమైనది. భారత్ ఏదైనా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తే ఇందులో ఉన్న సెన్సార్లు ట్రాక్ చేస్తాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఇండియా మిస్సైల్ టెస్టులను నిర్వహిస్తుంటుంది. దీంతో, ఈ నౌక మన మిస్సైల్స్ పరీక్షలను పూర్తిగా ట్రాక్ చేస్తుంది. 

ఈ నౌకలో ఉన్న పరికరాలన్నీ అత్యంత అధునాతనమైనవి. మనం మిస్సైల్స్ ను పరీక్షిస్తే ఇందులో అమర్చిన హైటెక్ పరికరాలు మన క్షిపణుల రేంజ్, కచ్చితత్వాన్ని యాక్యురేట్ గా కొలవగలవు. 

మరోవైపు, ఇంధనాన్ని నింపుకోవడానికే ఇక్కడకు వచ్చినట్టు చైనా చెపుతోంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 22 వరకు ఈ నౌక శ్రీలంక పోర్టులో ఉంటుంది. జులై 14న చైనా నుంచి ఇది బయల్దేరింది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టులో అడుగుపెట్టేంత వరకు ఇది ఏ ఇతర పోర్టులో కూడా ఆగలేదనే సంగతి గమనార్హం. నెల రోజులకు పైగా గడిచిపోయినా ఎక్కడా ఇంధనాన్ని నింపుకోలేదు. 

యువాంగ్ వాంగ్ 5 మహాసముద్రాల్లో సర్వేలను కూడా నిర్వహించగలదు. హిందూ మహాసముద్రంలో జలాంతర్గాముల ఆపరేషన్స్ కు సహకరించగలదు. చైనాకు చెందిన జీయాంగ్ యాంగ్ హాంగ్ 03 సర్వే నౌక గత ఏడాది హిందూ మహాసముద్రంలో సర్వే ఆపరేషన్ చేపట్టింది. పశ్చిమ సుమత్రా ప్రాంతంలో రహస్యంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. యువాంగ్ వాంగ్ 5 దీనికంటే అత్యంత హైటెక్ నౌక కావడం గమనార్హం. 

2014లో తమ పోర్టులో ఆగేందుకు చైనాకు చెందిన న్యూక్లియర్ పవర్ కలిగిన జలాంతర్గామికి శ్రీలంక అనుమతిని ఇచ్చింది. ఆ సందర్భంగా భారత్-శ్రీలంక మధ్య సంబంధాలు కుదుపుకు గురయ్యాయి. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీలంక దీనిపై స్పందిస్తూ... చైనా గూఢచార నౌక ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను ఎప్పుడూ ఆన్ లోనే ఉంచుకోవాలని... ఎలాంటి సైంటిఫిక్ రీసర్చ్ జరపకూడదని చెప్పింది. శ్రీలంక చెపుతున్న మాటలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ నౌక ప్రస్తుతం ఉన్న హంబన్ టోటా పోర్టు చైనా అధీనంలో ఉంది. చైనా మర్చెంట్ పోర్ట్ హోల్డింగ్స్ సంస్థకు శ్రీలంక ఈ పోర్టును 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది. అంతేకాదు... దీనిపై శ్రీలంక మాట్లాడుతూ, చైనా నౌకకు సంబంధించిన ఆపరేషనల్ ఇష్యూలను చైనీస్ కంపెనీనే చూసుకుంటుందని చెప్పింది. ఇది కూడా ఆందోళన కలిగించే అంశమే.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో... శ్రీలంక ఎంత చెప్పినా చైనా నౌక విషయంలో భారత్ నమ్మే పరిస్థితుల్లో లేదు. హంబన్ టోటా పోర్టును చైనా మిలిటరీ ఆపరేషన్లకు ఉపయోగించుకుంటుందనే అనుమానాలు, ఆందోళనలు భారత్ కు ఉన్నాయి. చైనాతో మనకు ఇప్పటికే సరిహద్దు సమస్యలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడూ ఏదో విధమైన ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే... గూఢచార నౌక శ్రీలంకకు రావడంపై భారత్ ఆందోళన, అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

మనకు శత్రు దేశంగా ఉన్న చైనా... శ్రీలంకలో అతి పెద్ద పెట్టుబడిదారుడిగా ఉంది. శ్రీలంక మౌలిక వసతుల నిర్మాణంలో భారీ పెట్టుబడులు పెట్టింది. ఇందుకు ప్రతిఫలంగానే హంబన్ టోటా పోర్టును తన గుప్పెట్లోకి తీసుకుంది. మరోవైపు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు కష్టకాలంలో అండగా నిలిచింది భారత్ మాత్రమే. పెట్రోల్, డీజీల్ ను ఆ దేశానికి మనమే సరఫరా చేస్తున్నాం. ఆహారం, ఔషధాలను అందిస్తున్నాం. మానవతా దృక్పథంతో లంకకు చైనా చేసిందేమీ లేదు. శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టేసి... ఆ దేశంపై పెత్తనం చెలాయించేందుకు యత్నిస్తోంది.


More Telugu News