మధుమేహం ఉన్నవారు ఏ కూరగాయలు తినాలి.. వేటికి దూరంగా ఉండాలి.. నిపుణుల సూచనలివిగో!

  • భూమి లోపల పండే దుంపల వంటి వాటిలో అధికంగా కార్బోహైడ్రేట్లు
  • అవి రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయంటున్న నిపుణులు
  • ఎక్కువగా ఫైబర్ ఉండే కూరగాయలతోనే ప్రయోజనమని వెల్లడి
  • కూరగాయలు ఏవైనా నిల్వ చేసినవి కాకుండా తాజావి తీసుకోవాలని సూచన
సాధారణంగా మధుమేహం ఉన్నవారిని కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. అయితే కూరగాయల్లోనూ అన్ని రకాలూ వాడొద్దని, కొన్నిరకాల కూరగాయలతో ఇబ్బంది ఉంటుందని హెచ్చరిస్తుంటారు. దీనితో ఏవి తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి? అన్న గందరగోళం చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మధుమేహం ఉన్నవారు ఏయే కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలన్నది పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఏయే కూరగాయలను ఏ రూపంలో తీసుకోవచ్చన్నదీ వివరిస్తున్నారు. 

వైద్య నిపుణులు చెబుతున్నదేమిటి?
ఎలాంటి కూరగాయలు తీసుకోవచ్చన్న వివరాలను బ్రిటన్‌ కు చెందిన కాన్సెప్టో డయాగ్నస్టిక్స్‌ డాక్టర్‌ తారీఖ్‌ మహమూద్‌, డాక్టర్‌ ఫాక్స్‌ ఆన్‌ లైన్‌ ఫార్మసీకి చెందిన డాక్టర్‌ డెబోరా లీ వెల్లడించారు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉ‍న్న పదార్థాలు తీసుకోవాలని, అందువల్ల రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. దీనివల్ల మందులు వాడాల్సిన అవసరం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

కీలక సూచన ఏమిటంటే.. భూమి లోపల పండే దుంపల వంటి కూరగాయలకంటే.. ఉపరితలంపైన పెరిగే కూరగాయల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే ఇది అన్నింటి విషయంలోనూ కాదని, ఉపరితలంపై పెరిగే కొన్నింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

ఏయే కూరగాయలను తీసుకోవడం మంచిది? 
  • క్యాబేజీ, బ్రకోలి వంటి ఆకుల తరహాలో ఉండే కూరగాయలు
  • పాలకూర, బచ్చలి, కేల్‌ వంటి ఆకుకూరలు 
  • ఆస్ఫరాగస్‌
  • పచ్చని బీన్స్‌
  • వంకాయ
  • క్యాప్సికమ్‌, ఇతర మిర్చి రకాలు
  • సెలరీ
  • పుట్టగొడుగులు
  • బీన్స్‌, ఇతర చిక్కుడు జాతి కూరగాయలు
  • టమాటా, ఉల్లిపాయలు, దోసకాయలు
  • అయితే కూరగాయలు ఏవైనా సరే తాజాగా ఉన్నవాటితోనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టినవి, నిల్వ చేసినవాటిలో పోషక విలువలు తగ్గిపోతాయని వివరిస్తున్నారు.

ఏ కూరగాయలకు దూరంగా ఉండాలి?
మధుమేహంతో బాధపడుతున్నవారు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దుంపలు వంటివాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని.. అవి రక్తంలో చక్కెరలు వేగంగా పెరిగేందుకు కారణమవుతాయని వివరిస్తున్నారు. అయితే వీటిని మొత్తంగా మానేయాల్సిన అవసరం లేదని.. అతి తక్కువ పరిమాణంలో తీసుకుంటూ, మొత్తంగా శరీరానికి అందే కేలరీలు తగ్గేలా జాగ్రత్త వహిస్తే చాలని వివరిస్తున్నారు.
  • ఆలుగడ్డ, చిలగడ దుంపలు
  • గుమ్మడి పండు, దాని జాతికి చెందిన బట్టర్‌నట్‌ స్వ్క్వాష్‌
  • కర్ర పెండలం, కంద
  • మొక్కజొన్న (స్వీట్‌ కార్న్‌)
  • వెజిటబుల్‌ జ్యూస్‌ (రసం రూపంలో తీసినప్పుడు కూరగాయల్లోని ఫైబర్‌ పోయి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా మిగులుతాయి)
  • టమాటా పురీ (ప్రాసెస్‌ చేయడం వల్ల దీనిలోనూ ఫైబర్‌ తగ్గిపోతుంది. కావాలంటే ఒక టేబుల్‌ స్పూన్‌ వరకు తీసుకోవచ్చు)
  • ప్రాసెస్‌ చేసి, నిల్వ చేసిన అన్నిరకాల కూరగాయలకు దూరంగా ఉండాలి.

కూరగాయలను ఇష్టంగా తినేందుకు కొన్ని మార్గాలివీ..
  • కొంత మంది కూరగాయలను తినేందుకు ఆసక్తి చూపరు. అలాంటి వారు వేర్వేరు రకాల కూరగాయలను చిన్నగా తరిగి, సలాడ్‌ రూపంలో తింటే.. అనాసక్తి పోతుందని నిపుణులు చెబుతున్నారు. కావాలంటే చిన్నగా తరిగిన కూరగాయలపై కొద్దిగా వెన్నతో చేసిన సాస్‌, టమాటా, ఉల్లిగడ్డ, కొంచెం కారం, ఉప్పు, మిరియాల పొడి వంటివి చల్లుకుని తింటే రుచిగా ఉంటాయని వివరిస్తున్నారు.
  • చిక్కుడు జాతికి చెందిన గింజలను బాగా ఉడికించి మెత్తని పేస్ట్‌లా చేసుకుని.. కూరగాయల ముక్కలకు దానికి కలుపుకొని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు.
  • సాధారణంగా ఒకే రంగులో ఉండే కూరగాయ ముక్కలను చూస్తే ఒక రకమైన భావన వస్తుందని.. అందువల్ల ఆవిరిపై ఉడికించిన క్యారెట్‌, బీన్స్‌, బ్రకోలి, టమాటా వంటివాటిని కలిపి తీసుకుంటే బాగుంటుందని వివరిస్తున్నారు.



More Telugu News