ఏఐఎఫ్ఎఫ్ పై నిషేధం.. రేపు సుప్రీంకోర్టులో విచారణ

  • తక్షణం విచారించాలని కోరిన కేంద్ర ప్రభుత్వం
  • ఫిఫా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడి
  • వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
అఖిల భారత ఫుట్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)పై ఫిఫా సస్పెన్షన్ అంశం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. దీనిపై తక్షణం విచారణ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. భారత ఫుట్ బాల్ సమాఖ్య మూడోపక్ష ప్రభావం మేరకు నడుచుకుంటుందని ఆరోపిస్తూ ఫిఫా నిషేధ నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. 

దీనిపై బుధవారం విచారణ నిర్వహిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం తెలిపింది. ‘‘కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. భారత్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఫిఫా లేఖను పంపించింది. ఇది పబ్లిక్ డొమైన్ లోనూ అందుబాటులో ఉంది. దీన్ని ఆన్ రికార్డుగా పరిగణనలోకి తీసుకోవాలి. జెనీవాలో కూర్చున్న ఫిఫా భారతదేశానికి సంబంధించి కీలక పరిణామాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటోంది. వాటిని కోర్టు ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని తుషార్ మెహతా పేర్కొన్నారు.

85 ఏళ్ల చరిత్ర కలిగిన ఫిఫా భారత ఫుట్ బాల్ సమాఖ్యపై నిషేధాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి. ఏఐఎఫ్ఎఫ్ పై ఫిఫా నిర్ణయాల వెనుక సుప్రీంకోర్టు తీసుకున్న చర్యల ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. 2020 డిసెంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, ఆ పని చేయనందుకు ఏఐఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ను ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు తొలగించింది. ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి ఏఐఎఫ్ఎఫ్ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. 



More Telugu News