తెలంగాణ-ఏపీ సరిహద్దులో పులి కలకలం!

  • ఖమ్మంపాడు-చిలుకూరు గ్రామాల మధ్య పులిని చూశామన్న వ్యవసాయ కూలీలు
  • అది అటువెళ్లడాన్ని తాము కూడా చూశామన్న ఎన్టీఆర్ జిల్లాలోని సరిహద్దు గ్రామ కూలీలు
  • అది హైనా అయి ఉండొచ్చంటున్న అటవీశాఖ అధికారులు
అడవులను వీడుతున్న పులులు గ్రామాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. జూన్‌లో విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో సంచరించిన పులి రెండు ఆవులపై దాడి చేసి ఓ దానిని చంపేసింది. గత నెలలో అనకాపల్లిలో ఓ పులి అటవీ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. 

ఇక, మూడునాలుగు రోజుల క్రితం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం బొగ్గుల వాగు ప్రాజెక్టు సమీపంలో పులి సంచారం వార్తలు కలకలం రేపాయి. తాజాగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు-చిలుకూరు గ్రామాల మధ్య పులి సంచరిస్తోందన్న వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పులి రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్లడం చూశామని వ్యవసాయ కూలీలు కొందరు చెబుతున్నారు.  

మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం అన్నవరం-దొడ్డ దేవరపాడు గ్రామాల మధ్య తాము పులిని చూసినట్టు మరికొందరు తెలిపారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ పులి రోడ్డు దాటి ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఖమ్మంపాడు-తొండలగోపవరం వైపు వచ్చినట్టుగా కూలీలు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కూలీలు పులిని చూసినట్టుగా చెబుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, వారు చెబుతున్నట్టు అది పులి అయి ఉండకపోవచ్చని, హైనా అయి ఉండొచ్చని చెబుతున్నారు.


More Telugu News