‘ఎట్ హోం’ కార్యక్రమానికి హాజరుకాని కేసీఆర్.. స్పందించిన గవర్నర్ తమిళిసై

  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ తేనీటి విందు
  • కేసీఆర్ హాజరవుతారని తొలుత సమాచారం
  • ఎదురు చూసినా రాకపోవడంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్
  • హాజరు కాని టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు
  • కాంగ్రెస్ నేతలు కూడా గైర్హాజరు
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. సీఎంను ఆహ్వానిస్తూ తాను స్వయంగా లేఖ రాశానని, అయినప్పటికీ ఆయన ఎందుకు రాలేదో తనకు తెలియదని అన్నారు. 

నిజానికి సాయంత్రం 6.55 గంటలకు కార్యక్రమానికి హాజరవుతారని సీఎం కార్యాలయం తెలిపిందని అన్నారు. ముఖ్యమంత్రి రాకపోవడంపై తమకు ఎలాంటి సమాచారమూ లేదని, ఆయన కోసం తాను, హైకోర్టు చీఫ్ జస్టిస్ అరగంటపాటు ఎదురుచూశామన్నారు. అయినప్పటికీ రాకపోవడం, అతిథులందరూ ఎదురుచూస్తుండడంతో కార్యక్రమాన్ని ప్రారంభించక తప్పలేదన్నారు.

సాయంత్రం ఆరు గంటలకు తమిళిసై పుదుచ్చేరి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ దంపతులు సహా అతిథులందరూ అప్పటికే చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం 7.20 గంటల వరకు ఎదురుచూసినా రాకపోవడంతో గవర్నర్ తేనేటి విందును ప్రారంభించారు. 

‘ఎట్ హోం’ కార్యక్రమానికి మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్లు చెన్నమనేని విద్యాసాగర్‌రావు, పీఎస్ రామ్మోహన్‌రావు, ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరు కాగా, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య, హైదరాబాద్ సీపీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, స్వాతంత్ర్య సమరయోధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అయితే, టీఆర్ఎస్ నుంచి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎవరూ పాల్గొనలేదు. అలాగే, కాంగ్రెస్ నేతలు కూడా ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.


More Telugu News