విమానంలో ప్రియురాలితో చాటింగ్.. పక్కసీట్లో వ్యక్తి చూడడంతో ఆరు గంటలపాటు నిలిచిపోయిన విమానం

  • మంగళూరు నుంచి ముంబై వెళ్తున్న విమానంలో ఘటన
  • ‘యూ ఆర్ ద బాంబర్’ అని గాళ్ ఫ్రెండ్ చాటింగ్
  • అది చూసి విమాన సిబ్బందికి చెప్పిన ప్రయాణికురాలు
  • ప్రయాణికులను దింపేసి తనిఖీలు
  • ఫ్రెండ్లీ చాటింగేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
విమానంలో తోటి ప్రయాణికుడు తన గాళ్ ఫ్రెండ్‌తో చేస్తున్న చాటింగ్‌ను వెనక సీట్లో కూర్చున్న ప్రయాణికురాలు చూడడంతో విమానం ఆరుగంటలపాటు నిలిచిపోయింది. కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. మంగళూరు నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు రెడీ అయింది. ప్రయాణికులు సీటు బెల్టులు ధరించి సిద్ధంగా ఉన్నారు. 

ఈ క్రమంలో విమానంలో తన ముందు సీట్లో కూర్చున్న యువకుడు తన ప్రియురాలితో చేస్తున్న చాటింగ్‌ను వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలు చూసింది. అందులో ‘యు ఆర్ ద బాంబర్’ అన్న మెసేజ్ కనిపించింది. అంతే వెంటనే కీడు శంకించిన ఆమె విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన కేబిన్ సిబ్బంది దానిని పైలట్ దృష్టికి తీసుకెళ్లడంతో విమానం టేకాఫ్ ఆగిపోయింది. 

ఆ తర్వాత విమానంలోని 185 మంది ప్రయాణికులను కిందికి దించేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, అందులో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, చాటింగ్ చేసిన యువకుడిని, అదే విమానాశ్రయంలో బెంగళూరు వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్న అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. వారి సంభాషణ సరదాగా సాగిందని తేలడంతో విమానం బయలుదేరేందుకు అధికారులు అనుమతినిచ్చారు. 

దాదాపు ఆరుగంటలపాటు నిలిచిపోయిన విమానం చివరికి సాయంత్రం 5 గంటలకు బయలుదేరింది. అయితే, విచారణ జరుగుతున్న నేపథ్యంలో యువకుడిని వెళ్లేందుకు అనుమతించలేదు, అలాగే అతడి ప్రియురాలు కూడా బెంగళూరు వెళ్లే విమానాన్ని మిస్సైంది. కాగా, వారిద్దరి మధ్య జరిగింది ఫ్రెండ్లీ చాటింగేనని, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు.


More Telugu News