పోర్న్ లింకులు ఎరగా వేసి కుల్ఫీ వ్రికయదారును ఉచ్చులోకి లాగిన పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు

  • పోర్న్ వీడియోలు చూసే అలవాటుతో పాక్ వలకు చిక్కిన యువకుడు
  • భారత సైనిక రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నం
  • ప్రతిఫలంగా కొద్ది మొత్తాల్లో డబ్బు
  • నిఘా వేసిన భారత ఏజెన్సీలు
భారత సైన్యం గుట్టుమట్లు తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా వర్గాలు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటాయని తెలిసిందే. వాటిలో ప్రధానమైనది హనీ ట్రాప్. అమ్మాయిలను ఎరగా వేసి తమకు కావాల్సిన సమాచారం రాబట్టుకోవడం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా, పోర్న్ సైట్ల సాయంతోనూ భారతీయులకు వల విసిరేందుకు పాక్ నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయన్న విషయం వెల్లడైంది. అందుకు నారాయణ్ లాల్ అనే కుల్ఫీ విక్రయదారు ఉదంతమే నిదర్శనం. నారాయణ్ లాల్ రాజస్థాన్ లోని భిల్వారా ప్రాంతానికి చెందినవాడు. కుల్ఫీలు అమ్ముకోవడమే కాదు, మేకలు పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. అతడు స్థానికంగా జానపద గాయకుడిగానూ ప్రాచుర్యం పొందాడు. 

అయితే, ఫోన్ లో పోర్న్ సైట్లను సందర్శించే అలవాటు అతడిని పాకిస్థాన్ నిఘా సంస్థకు దగ్గర చేసింది. ఈ ఏడాది ఆరంభంలో నారాయణ్ లాల్ ఓ పోర్న్ వాట్సాప్ గ్రూప్ లో చేరాడు. ఆ గ్రూప్ లో పాకిస్థానీలు సహా పలు దేశాలకు చెందిన 250 మంది వరకు సభ్యులుగా ఉన్నారు. అయితే నారాయణ్ లాల్ వారం రోజులకే ఆ గ్రూప్ నుంచి వైదొలిగాడు. ఎందుకు వైదొలిగావంటూ ఓ పాకిస్థాన్ ఫోన్ నెంబరు నుంచి అతడికి కాల్ వచ్చింది. అవతలి నుంచి తనను తాను అనీల్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి కారణం ఏంటని అడిగాడు. అక్కడ్నించి ఇద్దరి మధ్య వాట్సాప్ సందేశాలు, వాట్సాప్ కాల్స్ నడిచేవి. 

అనీల్ ఆపైన సాహిల్ అనే పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంటును నారాయణ్ లాల్ కు పరిచయం చేశాడు. పాకిస్థాన్ రావాలని, తాము అతడికి బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇస్తామని నారాయణ్ లాల్ కు ప్రతిపాదన చేశారు. పాస్ పోర్టు, వీసా కోసం నారాయణ్ లాల్ వారు అడిగిన మేరకు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వివరాలు, పాస్ పోర్టు ఫొటోలు సమర్పించాడు. అంతేకాదు, అనీల్, సాహిల్ లకు 5 భారత సిమ్ కార్డులు కూడా పంపించాడు. అందుకు గాను వాళ్లిద్దరి నుంచి నారాయణ్ లాల్ కు రూ.5 వేల నజరానా అందింది. 

ఇక, భారత సైనిక స్థావరాల్లో ప్రవేశించి, అక్కడి సైనికులతో స్నేహం చేసి, వారిని తమకు పరిచయం చేయాలని నారాయణ్ లాల్ కు అనీల్, సాహిల్ సూచించారు. అక్కడ్నించి నారాయణ్ లాల్ వారు కోరిన మేరకు సైనికుల ఫొటోలు, సైనిక స్థావరాలు, వాహనాల ఫొటోలు పంపేవాడు. ఇక రాజస్థాన్ లో కన్హయ్య లాల్ అనే దర్జీ హత్యకు సంబంధించిన వీడియో తమకు కావాలని వారు కోరగా, ఓ వాట్సాప్ గ్రూపులో వచ్చిన వీడియోను నారాయణ్ లాల్ వారికి పంపించాడు. 

అంతేకాదు, ఉదయపూర్ కంటోన్మెంట్ ఏరియా సమీపంలో ఓ జిరాక్స్ షాపు ఏర్పాటు చేయాలని, అందుకు తాము రూ.5 లక్షల వరకు పంపిస్తామని ఆ పాక్ ఏజెంట్లు లాల్ కు తెలిపారు. తొలుత రూ.3 వేలు పంపించారు. జిరాక్స్ షాపు ఏర్పాటైన తర్వాత అతడికి నెల జీతం కూడా చెల్లిస్తామని చెప్పారు. కంటోన్మెంట్ ఏరియాలో ఉండే సైనికులు ఏవైనా పత్రాలు జిరాక్స్ తీయించుకునేందుకు వచ్చినప్పుడు, ఆ పత్రాల కాపీలను తమకు అందజేయాలని అనీల్, సాహిల్ కోరారు. వారి ప్రతిపాదనకు నారాయణ్ లాల్ అంగీకరించాడు. 

అయితే, భారత నిఘా సంస్థలు నారాయణ్ లాల్ వ్యవహారంపై అనుమానంతో విచారణ జరపగా, అతడు పాక్ ఏజెంట్ల ఉచ్చులో చిక్కుకున్న విషయం వెల్లడైంది. పాక్ ఏజెంట్లతో అతడి సంభాషణలను గుర్తించారు. తగిన ఆధారాలను రాజస్థాన్ పోలీసులకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, రాజస్థాన్ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద నారాయణ్ లాల్ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. కాగా, ఇద్దరు పాక్ ఏజెంట్లలో ఒకరు ఢిల్లీలో ఉంటున్నట్టు గుర్తించి, అతడి కోసం గాలింపు చేపట్టారు.


More Telugu News