ప్రపంచంలో 4 వేల పులులు ఉన్నాయి.. కానీ రాహుల్ ద్రావిడ్ ఒక్కడే: న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్

  • తన స్వీయ ఆత్మకథలో సంచలన విషయాలు వెల్లడించిన రాస్ టేలర్
  • భారత్ లో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయానని వ్యాఖ్య
  • 2011 నాటి ఘటనలను తన పుస్తకంలో గుర్తు చేసుకున్న రాస్ టేలర్
భారత దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ తనను ఎంతో ఆకట్టుకుందని.. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ కు ఉన్న ఫాలోయింగ్ తనకు నచ్చిందని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్ రాస్ టేలర్‌ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన తన స్వీయ ఆత్మకథ ‘బ్లాక్ అండ్ వైట్’లో ఆయన వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. భారత టీ20 లీగ్‌ లో తాను పాల్గొన్నప్పుడు రాజస్థాన్‌ ఓనర్లలో ఒకరు తనను కొట్టాడని పేర్కొన్న రాస్ టేలర్‌.. టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

2011 నాటి ముచ్చట్లు చెబుతూ..
తాను 2011లో రాజస్థాన్ జట్టు ఆడినప్పటి సంగతులను రాస్‌ టేలర్‌ తన స్వీయ ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు. అప్పుడు రాహుల్‌ ద్రావిడ్ కూడా రాజస్థాన్‌ తరఫునే ఆడారని.. ఆ సమయంలో పులులను చూసేందుకు తాము రణతంబోర్ జాతీయ పార్క్‌ కు వెళ్లామని పేర్కొన్నారు. భారత క్రికెటర్లకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యక్షంగా చూసి, ఆశ్చర్యపోయాయనని వివరించారు. ఒకసారి ఏదో మాటల సందర్భంగా ఎన్నిసార్లు పులిని చూశారని రాహుల్‌ ద్రావిడ్ ను అడిగానని.. 21 సార్లు వెళ్లినా ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదని చెప్పారని గుర్తు చేసుకున్నారు. 

ద్రావిడ్ ఆనంద పడ్డారు
ఆ రోజున మధ్యాహ్నం రాహుల్ ద్రావిడ్ తో కలిసి మళ్లీ జాతీయ పార్క్ కు వెళ్లామని.. ఈ సారి పులి కనిపించిందని రాస్ టేలర్ తెలిపారు. 21 సార్లు వెళ్లినా కనిపించని పులి.. 22వ సారి త్వరగా కనిపించడంతో రాహుల్ ద్రావిడ్ ఆనందం వ్యక్తం చేశారని వివరించారు. తాము పులిని చూసేందుకు ఓపెన్ టాప్ ఉన్న జీప్ లో ఎక్కామని.. చాలా దగ్గరగా పులిని చూశామని తెలిపారు. అయితే అంతకన్నా తనను మరో విషయం ఎక్కువ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

అక్కడ పులి కనిపించినా..
తాము పులిని చూస్తూంటే.. పులులను చూడటానికి వచ్చిన జనం మాత్రం ఆ పులిని వదిలేసి, రాహుల్ ద్రావిడ్ ను ఫొటోలు తీయడం మొదలుపెట్టారని తెలిపారు. తాము పులిని చూసిన ఆనందం కంటే వారు రాహుల్ ద్రావిడ్ ను చూసిన ఆనందమే ఎక్కువగా అనిపించిందన్నారు. తనకు తెలిసినంత వరకు ప్రపంచంలో 4వేల పులులు ఉంటాయేమోగానీ.. రాహుల్‌ ద్రావిడ్ మాత్రం ఒక్కడేనని.. అందుకే ఆయన పట్ల ఇంత క్రేజ్‌ అని రాస్‌ టేలర్ పేర్కొన్నారు.



More Telugu News