మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'కార్తికేయ 2'
  • ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన కథాకథనాలు
  • క్లారిటీ లోపించిన సన్నివేశాలు
  • లవ్ ట్రాక్ ను పెద్దగా టచ్ చేయని దర్శకుడు  
  • ప్రధానమైన బలంగా నిలిచిన కెమెరా పనితనం
నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' ఘన విజయాన్ని సాధించింది. సుబ్రమణ్యపురం అనే ఊళ్లో సుబ్రమణ్య స్వామి  ఆలయం చుట్టూ ఆ కథ తిరుగుతుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'కార్తికేయ 2' ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథ ద్వాపరయుగంతో ముడిపడిన ఒక రహస్యానికి సంబంధించి ద్వారకానగరం చుట్టూ తిరుగుతుంది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు.

కథలోకి వెళితే .. కార్తికేయ (నిఖిల్) ఓ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తుంటాడు. పూజలు చేస్తే కోరికలు నెరవేరతాయి .. హోమాలు చేస్తే కార్యాలు ఫలిస్తాయి అనే కాన్సెప్టుకి అతను వ్యతిరేకి. అలాంటి అతను తల్లి మాట కాదనలేక ఆమెతో కలిసి  మొక్కు తీర్చుకోవడానికి 'ద్వారక' చేరుకుంటాడు. ఇదిలా ఉంటే .. పురావస్తుశాఖలో పరిశోధకుడిగా ఉన్న ప్రొఫెసర్  రామం దృష్టికి ద్వాపరయుగం నాటి ఒక రహస్యం వస్తుంది. ద్వాపరయుగం అంతరించే సమయంలో తన మిత్రుడైన 'ఉద్ధవుడు'కి కృష్ణుడు తన కాలుకి ఉన్న కడియం తీసి ఇస్తాడు. 

రానున్న కాలంలో మానవాళిని రక్షించడానికి అవసరమైన రహస్యాలు ఆ కడియంలో నిక్షిప్తం చేసి ఉన్నాయని శ్రీకృష్ణుడు అంటాడు. దానిని భద్రపరచమనీ .. ఆ కార్యాన్ని నెరవేర్చే సమర్థుడే భవిష్యత్తులో దానిని వెతుక్కుంటూ వస్తాడని ఉద్ధవుడితో చెబుతాడు. కొన్ని సంకేతాల ద్వారా ఆ కడియం రహస్యాన్ని కనుక్కునేలా ఉద్ధవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గంలో రామం కొంతదూరం ప్రయాణిస్తాడు. ఆ కడియాన్ని చేజిక్కించుకోవడానికి అతణ్ణి 'శంతను' (ఆదిత్య మీనన్) రహస్యంగా అనుసరిస్తుంటాడు. తాను తలపెట్టిన కార్యాన్ని ద్వారకలో కార్తికేయకు అప్పగిస్తూ రామం కన్నుమూస్తాడు. అప్పుడు కార్తికేయ ఏం చేస్తాడు? పర్యవసానంగా ఆయనకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనేది కథ.

ద్వాపరయుగం .. ద్వారకానగరం .. ఈ రెండింటితో ముడిపడిన ఒక రహస్యం. జనాలను థియేటర్లకు రప్పించడానికి ఈ లైన్ చాలు. ఎందుకంటే ద్వాపరయుగానికి సంబంధించిన అంశాలను .. అనేక విశేషాలకు నిలయ మైన ద్వారకానగరం గురించి తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత అందరిలో ఉంటుంది. ఆ ఆసక్తినే ఆడియన్స్ ను థియేటర్ కి రప్పిస్తుంది. అయితే థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు ద్వాపరంలోగానీ .. ద్వారకలో గాని ఆశించిన స్థాయి కథ కనిపించదు. ఊహించని సన్నివేశాలు ఉక్కిరిబిక్కిరి చేయవు.

శ్రీకృష్ణుడు తనకి కాలుకు గల 'కడియం' తీసి ఇవ్వడమే కరెక్టు కాదనిపిస్తుంది. ఆ కడియాన్ని వెలికి తీయడం వలన  లోకానికి ఎలా మంచి జరుగుతుందనేది సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. ఆ కడియాన్ని బయటికి తీసే వ్యక్తిని భగవంతుడే ఎంచుకున్నాడనే  డైలాగ్స్ చెప్పించారుగానీ .. అందుకు సంబంధించిన సంకేతాలను ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయారు. శ్రీ కృష్ణుడి కంకణం విషయంలో ఇటు హీరోకి గానీ .. అటు విలన్ కి గాని క్లారిటీ ఉన్నట్టుగా మనకి అనిపించదు. ఒకవేళ కంకణం దొరికితే మానవాళికి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు. 

కంకణం ఆనవాళ్లను తెలియజేసే సంకేత వస్తువులను మాత్రం హీరో అవలీలగా చేజిక్కించుకుంటూ ఉంటాడు. అందుకు 'అభీరులు' అనే తెగకి చెందిన వ్యక్తులు ఎందుకు అడ్డుపడుతున్నారనే విషయంలో క్లారిటీ రావాలంటే మరో సారి సినిమా చూడాల్సిందే. ఇట్లా ఒక క్లారిటీ అనేది లేకుండా కథ అటూ ఇటూ  పరుగులు పెడుతూ ఉంటుంది. క్లారిటీ లేని ఈ కథ  .. శ్రీకృష్ణుడితో ముడిపడిన ద్వారకా .. మధుర .. బృందావనం .. గోవర్ధనగిరి .. ఇలా అనేలా లొకేషన్స్ మారుతూ వెళుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన విజువల్స్ అద్భుతంగా ఉండటం వలన హీరో అండ్ టీమ్ ను ప్రేక్షకుడు ఫాలో అవుతుంటాడు. 

ప్రధానమైన కథను చెప్పే సమయంలో వాడిన యానిమేషన్ బాగుంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే గుహలోని శ్రీకృష్ణుడి మూర్తితో పాటు అందుకు సంబంధించిన సెట్ వర్క్ బాగుంది. కాలభైరవ స్వరపరిచిన పాటలు అంతగా ఆకట్టుకోవు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన బలం అనడంలో అతిశయోక్తి లేదు. ఎడిటింగ్ పరంగా కూడా ఆయనకి మంచి మార్కులు ఇవ్వొచ్చు. 

నిఖిల్ .. అనుపమ .. శ్రీనివాస్ రెడ్డి .. వైవా హర్ష ఈ కథలో ట్రావెల్ అవుతూ ఉంటారు. అతిథిలా విలన్ అప్పుడప్పుడు కనిపించి పోతుంటాడు. 'కార్తికేయ'లో హైలైట్ గా నిలిచిన లవ్ ట్రాక్ ఈ సినిమాలో వీక్ అయింది. అనుపమ్ ఖేర్ వంటి ఆర్టిస్టును ఎందుకు అంధుడిగా చూపించవలసి వచ్చిందో అర్థం కాదు. కథలో ఎప్పుడైతే క్లారిటీ ఉండదో అప్పుడది అదుపు తప్పిన గుర్రంలా ఇష్టానుసారం  పరిగెడుతుంది. 'కార్తికేయ 2' చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది. ద్వాపర యుగం .. ద్వారకా నగరం అనే ఒక ఆసక్తికరమైన పాయింట్ తో కూడిన కథాకథనాలను ఆడియన్స్ ఆశించిన స్థాయిలో దర్శకుడు చెప్పలేకపోయాడనే అనుకోవాలి.

---  పెద్దింటి గోపీకృష్ణ


More Telugu News