మహిళ అవస్థ చూసి.. పండ్ల బండిని తోసిన చిన్నారి విద్యార్థులు.. నెటిజన్ల ప్రశంసలు.. వీడియో ఇదిగో
- ఓ వీధిలో తోపుడు బండిపై పండ్లు అమ్ముతూ వెళ్తున్న మహిళ
- ఒక చోట రోడ్డు బాగా ఎత్తుగా ఉండటంతో ఆగి సాయం కోసం చూసిన వైనం
- చాలా మంది పెద్దవాళ్లు పట్టించుకోకున్నా.. బండిని తోసి సాయం చేసిన ఇద్దరు చిన్నారులు
- వీడియో వైరల్.. పిల్లల తీరుపై నెటిజన్ల ప్రశంసలు
రోడ్డుపై తోపుడు బండిని తోసుకుంటూ పండ్లు అమ్ముకునే మహిళ ఆమె. అలా వెళుతూ ఉంటే ఓ వీధిలో రోడ్డు చాలా ఎత్తుగా ఉంది. ఎలా తోయాలా అని ఆమె అక్కడ ఆగి చూడటం మొదలుపెట్టింది. పైకి తోసేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టింది. వీధి వెంట నడుస్తూ వెళుతున్న చాలా మంది అది చూసినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఇంతలో ఇద్దరు విద్యార్థులు.. నిండా పదేళ్లు కూడా లేని చిన్నారులు అక్కడికి వచ్చారు. పండ్ల బండి మహిళ ఇబ్బందిపడుతుండటం చూసి.. సాయం చేశారు.
- వారిలో అబ్బాయి బండిని ముందు వైపు పట్టుకుని లాగుతుండగా.. అమ్మాయి బండి వెనుక వైపు నుంచి మహిళతో కలిసి ముందుకు తోసింది. ముగ్గురూ కలిసి బండిని ఎత్తు ఎక్కించేశారు.
- చిన్నారులు చేసిన సాయానికి సదరు మహిళ కృతజ్ఞతగా చెరో అరటి పండు ఇచ్చింది. చిన్నారులిద్దరూ అవి తీసుకుని వెళ్లిపోయారు.
- ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిమాన ట్విట్టర్ ఖాతా ‘మహంత్ యోగిజీ’ పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు. దీనికి లక్షల కొద్దీ వ్యూస్ రాగా.. వేల మంది లైక్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను షేర్ చేశారు.
- పండ్ల బండి మహిళను పట్టించుకోకుండా వెళ్లిన పెద్దవారిని తప్పుపడుతూనే.. చిన్నారులు చేసిన సాయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- ‘‘చిన్నారులకు సముద్రమంత దయ, జాలి ఉన్నాయి. అంత చిన్న పిల్లలైనా ఆలోచనతో సాయం చేశారు. అలాంటి సమయాల్లో ఏమీ పట్టించుకోకుండా వెళ్లే పెద్దవాళ్లు సిగ్గుపడాలి” అంటూ కామెంట్లు పెడుతున్నారు.