ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పిటిష‌న్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

  • త‌న ఇంటి వ‌ద్ద ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ రెక్కీ నిర్వ‌హించార‌న్న ర‌ఘురాజు
  • ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన‌ట్లుగా ర‌ఘు‌రాజుపై కేసు
  • కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ
  • ఇదివ‌ర‌కే ఇదే త‌ర‌హా పిటిష‌న్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన ఓ పిటిష‌న్‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు శుక్ర‌వారం కొట్టేసింది. త‌న‌పైనా, త‌న కుమారుడిపైనా న‌మోదు అయిన కేసును కొట్టేయాలంటూ ర‌ఘురామ‌కృష్ణరాజు ఇటీవ‌లే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి చేశారంటూ రఘురాజుతో పాటు ఆయన కుమారుడిపైనా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.

ఈ పిటిష‌న్‌పై శుక్ర‌వారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. విచార‌ణ సంద‌ర్భంగా పోలీసులు ర‌ఘురామ‌కృష్ణరాజు పిటిష‌న్‌కు వ్య‌తిరేకంగా కీల‌క వాద‌న‌లు వినిపించారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ర‌ఘురామ‌రాజు అనుచ‌రులు ఇంటిలో బంధించి హింసించార‌ని, దానికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని పోలీసుల త‌ర‌ఫు న్యాయవాది పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో అద‌నపు స‌మాచారం కోసం ర‌ఘురామ‌రాజు న్యాయవాది మ‌రింత గ‌డువు కోరారు.

ఈ సంద‌ర్భంగా క‌ల్పించుకున్న సుప్రీంకోర్టు.... కేసు ఎఫ్ఐఆర్‌ ద‌శ‌లోనే ఉంది క‌దా అని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ కేసులో విచార‌ణ జ‌ర‌గ‌నివ్వాల‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇలాంటి ద‌శ‌లో కేసును కొట్టివేయాల‌ని కోర‌డం స‌బ‌బు కాదని అభిప్రాయ‌ప‌డ్డ సుప్రీంకోర్టు... ర‌ఘురామ‌కృష్ణరాజు క్వాష్ పిటిష‌న్‌ను కొట్టేసింది. ఇదే త‌ర‌హాలో గ‌తంలో ఈ కేసును కొట్టేయాలంటూ ర‌ఘురామ‌రాజు వేసిన పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టివేసిన సంగ‌తి తెలిసిందే.


More Telugu News