మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం'
  • కొత్తదనం లేని కథ 
  • ఉత్కంఠను రేకెత్తించలేకపోయిన కథనం 
  • మరింత స్టైల్ గా కనిపించిన నితిన్
  • విలన్ గా మెప్పించిన సముద్రఖని  
  • బలహీనపడిన సెకండాఫ్
అవినీతి రాజకీయాలు .. బలమున్నోడిదే రాజ్యం వంటి రాజకీయాలకు సంబంధించిన కథలు తెలుగు తెరపైకి చాలానే వచ్చాయి. ఈ తరహా కథల్లో ప్రతినాయకుడు అవినీతి రాజకీయాలకు ప్రతినిధిగా కనిపిస్తూ ఉంటాడు. అతని ఆగడాలకు కళ్లెం వేసేవాడిగా హీరో కనిపిస్తాడు. ఇలాంటి ఒక కథతోనే 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రూపొందింది. ఇది పొలిటికల్ టచ్ తో నడిచే డ్రామా అనే విషయం టైటిల్ చెప్పేస్తోంది. నితిన్ సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. కొత్త దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలనుకున్నాడు? ఆ విషయంలో ఆయన ఎంతవరకూ సక్సెస్ అయ్యాడనేది చూద్దాం.  

కథలోకి వెళితే ..  సిద్ధూ (నితిన్) వైజాగ్ లోని ఓ శ్రీమంతుల కుటుంబానికి చెందిన కుర్రాడు. ఐఏఎస్ కావడమే ప్రధానమైన ఉద్దేశంగా ముందుకు వెళుతుంటాడు. ఆయనను మంత్రి కూతురైన నిధి (కేథరిన్) ఎంతగానో  ప్రేమిస్తుంటుంది. ఆమెతో అతని వివాహం జరిపించాలని సిద్ధూ తల్లిదండ్రులు (మురళీశర్మ - ఇంద్రజ) భావిస్తుంటారు. అయితే సిద్ధూ మాత్రం నిధిని ఒక స్నేహితురాలి మాదిరిగానే భావిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే వైజాగ్ బీచ్ లో తనకి తారసపడిన స్వాతి( కృతి శెట్టి)పై సిద్ధూ మనసు పారేసుకుంటాడు.

వైజాగ్ లో సిద్ధూతో కలిసి స్వాతి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటుంది. లాయర్ లను .. పోలీస్ ఆఫీసర్ లను ఒంటరిగా కలుస్తుంటుంది. ఆమె ఏం చేయబోతోంది? అనేది ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. మరో వైపున 'మాచర్ల'ను  రాజప్ప ( సముద్రఖని) తన గుప్పెట్లో పెట్టుకుని అక్కడి ప్రజలను భయపెడుతూ బ్రతుకుతుంటాడు. 'మాచర్ల'లో  30 ఏళ్లుగా ఎన్నికలు అనేవి లేకుండా ఏకగ్రీవంగా గెలుస్తూ నిరంకుశత్వాన్ని కొనసాగిస్తుంటాడు. అలాంటి ఊళ్లోకి అడుగుపెట్టిన స్వాతిని చంపడానికి రాజప్ప మనుషులు ప్రయత్నిస్తారు. రాజప్పతో స్వాతికి ఉన్న గొడవేంటి? స్వాతి నేపథ్యం తెలియకుండా ప్రేమించిన సిద్ధూ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేదే కథ. 

ఎడిటర్ గా 15 ఏళ్ల అనుభవం ఉన్న రాజశేఖర్ రెడ్డికి దర్శకుడిగా ఇది ఫస్టు మూవీ. ఆయన తయారు చేసుకున్న ఈ కథ కొత్తదేం కాదు .. బలమున్నదీ కాదు. గతంలో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. విలన్ తన ప్రాంతంలో ఎన్నికలు జరక్కుండా చూడటం .. అతనిని ఎదిరించి అక్కడ ఎన్నికలు జరిగేలా హీరో చూడటం అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఓటు వేయడానికి ఊళ్లో వాళ్లంతా భయపపడుతూ ఉండటం .. చివరి నిమిషంలో ఒక వృద్ధుడో .. అంగవైకల్యం ఉన్నవారో ఓటు వేయడానికి ధైర్యం చేసి అడుగుముందుకు వేయడం వంటి సన్నివేశాలు చాలా రొటీన్.

ఫస్టాఫ్ అంతా కూడా ఒక వైపున లవ్ .. మరో వైపున సస్పెన్స్ .. ఇంకో వైపున గుంతలకిడి గురునాథం (వెన్నెల కిశోర్) కామెడీతో నడుస్తుంది. అందువలన బోర్ అనిపించకుండా కథ ముందుకు వెళుతుంటుంది. నిజం చెప్పాలంటే లవ్  స్టోరీ కంటే తాను 'ఈగో కా బాప్' అంటూ వెన్నెల కిశోర్ చేసిన సందడి ఎక్కువ హైలైట్ అవుతుంది. ఈగో దెబ్బతిన్నప్పుడు ఆయన ఇచ్చిన చిత్రమైన మేనరిజం నవ్వులు పూయిస్తుంది. ఫ్యామిలీ ఫొటోలో తను మాత్రమే హైలైట్ అయ్యేలా చూసుకుంటూ .. భార్య బిడ్డలను అవుట్ ఫోకస్ లో ఉండేలా చూసుకోవడం ఆయన ఈగో ఇజానికి పరాకాష్ఠ. దర్శకుడు ఈ ట్రాక్ ను మాత్రం బాగానే లాగాడు. 

సెకండాఫ్ లో కామెడీ ట్రాక్ కి ఛాన్స్ లేదు ..  రొమాన్స్ గురించిన ఆలోచన చేసేంత తీరిక హీరో హీరోయిన్స్ కి లేదు. విలనిజమే విస్తరించి కనిపిస్తుంది. సముద్రఖని లుక్ తో పాటు ఆయన పాత్రను కూడా దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. ఇక ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ఇద్దరు సముద్రఖనులు కనిపిస్తారు. ఇద్దరు అవసరమా అనుకునే ప్రేక్షకులకు సమాధానం క్లైమాక్స్ లో దొరుకుతుంది. ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి కథ మరింత పుంజుకోవాలి. కానీ ఇక్కడ వీక్ అవుతుంది .. కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. జరగబోయేదేమిటో ప్రేక్షకులకు ముందుగా తెలిసిపోతుంటుంది.  

మాజీ కలెక్టర్ భార్యను విలన్ కొడుకు వెంబడించడం .. ఆమెను కాపాడబోయిన గుమస్తాను విలన్ కొడుకు చంపడం నాటకీయంగా అనిపిస్తాయి. విలన్ పై విజయం సాధించడానికి హీరో వేసే ఎత్తుగడలు కూడా కొత్తగా ఏమీ అనిపించవు..  ఎలాంటి థ్రిల్ కలిగించవు. నితిన్ ..  కృతి శెట్టి .. సముద్రఖని చుట్టూనే కథ నడుస్తుంది. మిగిలిన పాత్రలు అంతంత మాత్రంగా .. నామమాత్రంగా కనిపిస్తాయి. కేథరిన్ పాత్ర ఎందుకో  .. ఆ పాత్ర ప్రయోజనం ఏమిటో దర్శకుడికే తెలియాలి. ఇక నితిన్ జోడీగా ఆమె సెట్ కాలేదు కూడా. 

నితిన్ ఈ సినిమాలో చాలా స్టైల్ గా కనిపిస్తాడు. ఫైట్లు .. డాన్సులు బాగా చేశాడు. కాకపోతే ఇన్ని సినిమాల తరువాత కూడా 'మల్లీ' .. 'కల్లు' అంటూ 'ళ' వదిలేసి 'హలా' అనిపిస్తాడు. కృతి శెట్టితో పాటు మిగిలిన వాళ్లంతా ఎవరి పరిధిలో వాళ్లు చేశారు. మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటల విషయానికి వస్తే కలర్ఫుల్ గా కనిపిస్తుంటాయిగానీ సాహిత్యం అర్థమైన సందర్భాలు తక్కువ. అంజలి ఐటమ్ సాంగ్ తప్ప ట్యూన్ భలే కుదిరిందే .. బీట్ అదిరిపోయిందే అని మాత్రం అనిపించవు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాగుంది.  సాంగ్స్ ను .. ఫైట్స్ ను చిత్రీకరించిన తీరు బాగుంది .. ఎడిటింగ్ ఫరవాలేదు.

సినిమాలో సందర్భానుసారం వచ్చే కొన్ని డైలాగ్స్ మాత్రం మనసుకు పట్టుకుంటాయి. 'ఆమె ఏదైనా బలంగా కోరుకుంటూ ఉండాలి .. లేదంటే తన బలాన్ని కోల్పోయి ఉండాలి' .. 'నీకు జిల్లా కొత్త .. కానీ నాకు కలెక్టర్లు కొత్తకాదు' .. 'రాజప్పను గెలవాలంటే మరో రాజప్ప అయ్యుండాలి' .. 'ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం' వంటి  డైలాగులు ఆకట్టుకుంటాయి. కొత్తదనం లేని కథ .. ఉత్కంఠను రేకెత్తించలేని కథనం ప్రధానమైన లోపంగా కనిపిస్తాయి. ఫస్టాఫ్ లో సందడి చేసిన వెన్నెల కిశోర్ ను సెకండాఫ్ లో పూర్తిగా వదిలేయడం .. ప్రీ క్లైమాక్స్ సీన్స్ అంత పట్టుగా లేకపోవడం నిరాశపరుస్తాయి. సెకండాఫ్ పై మరింత శ్రద్ధ పెట్టి, ఇటు హీరోయిజం .. అటు విలనిజం పాళ్లు పెంచి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

--- పెద్దింటి గోపీకృష్ణ


More Telugu News