ముందుగా మీరు పొందుతున్న ఉచితాలేంటో చెప్పండి అంటూ.. సీజేఐ ఎన్వీ రమణకు ఆర్ఎల్డీ అధినేత ప్రశ్న

  • ఉచితాల కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందన్న సుప్రీం ధర్మాసనం
  • కోర్టు వ్యాఖ్యలు సాహసోపేతంగా ఉన్నాయన్న ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి 
  • అట్టడుగున ఉన్నవారికి  ప్రత్యక్ష సాయం అవసరం అని వ్యాఖ్య
ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచితాల పంపిణీ, వాగ్దానాలను సుప్రీంకోర్టు తీవ్రమైన సమస్యగా పేర్కొన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఉచితాల కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని, అదే విధంగా ప్రజల సంక్షేమం సమతుల్యంగా ఉండాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. 

అయితే, కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సాహసోపేతంగా కనిపిస్తున్నాయని, సరైన స్ఫూర్తితో లేవని జయంత్ చౌదరి అన్నారు. అట్టడుగునున్న వారికి రేషన్, ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యక్ష జోక్యం అవసరమన్నారు. ఇది  ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కును కాపాడటం కిందకే వస్తుందన్నారు. ఈ క్రమంలో సీజేఐకి లభిస్తున్న ఉచితాలంటో చెప్పాలని ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఇక, ఎన్నికల సమయంలో చాలా ఉచిత వాగ్దానాలు మేనిఫెస్టోలో భాగం కావని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యను కూడా ఆయన తిప్పికొట్టారు. 

 ‘బీజేపీకి నిజం కావచ్చు కానీ మాకు కాదు. మా యూపీ  విధానసభ ఎన్నికల ప్రచార ప్రసంగాలలో మా మేనిఫెస్టో నుంచి పొందిన వాగ్దానాలన్నీ ఉన్నాయి. పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించకుండా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ సమస్యలు తలెత్తుతాయి. నిపుణులు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన మేనిఫెస్టో, సమయానుకూలంగా ప్రకటించాలి. తద్వారా ఓటర్లు కీలక సమస్యలను అర్థం చేసుకోగలరు. వాగ్దానాలు ప్రజాస్వామ్య ఓటింగ్ ప్రక్రియ యొక్క పవిత్రతను కాపాడుకోవడంలో అంతర్భాగం’ అని ట్వీట్ చేశారు.


More Telugu News