ముంబైకి గుడ్‌బై చెప్పేస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఇకపై గోవాకు ఆడనున్న సచిన్ తనయుడు

  • ముస్తాక్ అలీ టోర్నీలో రెండే మ్యాచ్‌లు ఆడిన అర్జున్
  • ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడినా మైదానంలోకి దిగని సచిన్ తనయుడు
  • అర్జున్ ను ఆహ్వానించామన్న గోవా క్రికెట్ సంఘం
ఇప్పటి వరకు ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న అర్జున్ టెండూల్కర్ ఇకపై గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. 21 ఏళ్ల సచిన్ తనయుడు 2020-21 సీజన్‌లో ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ టోర్నీలో రెండంటే రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పటికీ మైదానంలో దిగే అవకాశం లభించలేదు.

ఈ నేపథ్యంలో ముంబైకి గుడ్‌బై చెప్పేసి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్టు అర్జున్ టెండూల్కర్ ప్రతినిధి తెలిపారు. అర్జున్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని, ముంబైతోనే ఉంటే అది సాధ్యం కాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 

మరోవైపు, అర్జున్ టెండూల్కర్ గోవాకు ప్రాతినిధ్యం వహించనున్న విషయాన్ని గోవా క్రికెట్ సంఘం నిర్ధారించింది. అర్జున్ రాకతో లెఫ్టార్మ్ స్పిన్నర్ కొరత తీరడంతోపాటు మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్ల బలం పెరుగుతుందని పేర్కొంది. అందుకనే ఆయనను ఆహ్వానించినట్టు తెలిపింది. అర్జున్‌తో ట్రయల్ మ్యాచ్‌లు ఆడిస్తామని, అందులో అతడి ప్రదర్శనను బట్టి సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని గోవా క్రికెట్ సంఘం అధ్యక్షుడు సూరజ్ తెలిపారు.


More Telugu News