కొండప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీలో కేశినేని ఓటు హక్కు వినియోగంపై పిల్‌కు విచార‌ణ అర్హ‌త ఉంది: ఏపీ హైకోర్టు

  • కొండ‌ప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మ‌ధ్య విభేదాలు
  • ఎంపీ కేశినేని నాని ఓటు హ‌క్కు వినియోగంపై ఇరువ‌ర్గాల వాద‌న‌లు
  • కొండ‌ప‌ల్లిలో త‌న ఓటు హ‌క్కు వినియోగంపై తేల్చాల‌ని నాని పిల్‌
  • పిల్‌కు విచార‌ణ అర్హ‌త లేదంటూ వైసీపీ కౌన్సిల‌ర్ల పిటిష‌న్‌
  • వైసీపీ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు 
ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం కొండ‌ప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ పాల‌క వ‌ర్గం ఎన్నిక‌కు సంబంధించి అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీల మ‌ధ్య వాదోప‌వాదాలు సాగిన సంగ‌తి తెలిసిందే. పాల‌కవ‌ర్గం ఎన్నిక‌లో స్థానిక ఎంపీగా ఉన్న విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునే విష‌యంపై ఇరు పార్టీల మ‌ధ్య విభేదాలు పొడ‌చూపాయి. దీంతో ఈ వ్య‌వహారాన్ని తేల్చాలంటూ కేశినేని నాని స‌హా కొండ‌ప‌ల్లికి చెందిన టీడీపీ కౌన్సిల‌ర్లు హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం (పిల్‌) దాఖ‌లు చేసిన సంగతి తెలిసిందే.

అయితే పిల్‌కు హైకోర్టులో విచార‌ణ అర్హ‌త లేదంటూ కొండ‌ప‌ల్లికి చెందిన వైసీపీ కౌన్సిల‌ర్లు కౌంట‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కౌంట‌ర్ పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టులో గురువారం విచార‌ణ సాగ‌గా... కేశినేని నాని ఓటు హ‌క్కు వినియోగంపై సివిల్ కోర్టుకు వెళ్లాలంటూ వైసీపీ కౌన్సిల‌ర్ల త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. ఆ త‌ర్వాత కేశినేని పిల్‌కు హైకోర్టులో విచార‌ణ అర్హ‌త ఉంద‌ని ఆయ‌న త‌ర‌ఫున న్యాయ‌వాది అశ్వ‌ని కుమార్ కోర్టుకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సుప్రీంకోర్టు జారీ చేసిన ప‌లు తీర్పుల‌ను ఉటంకించారు.

ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న హైకోర్టు... కేశినేని నాని దాఖ‌లు చేసిన పిల్‌కు హైకోర్టులో విచార‌ణ అర్హ‌త ఉంద‌ని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కొండ‌ప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ పాల‌క‌వ‌ర్గం ఎన్నిక‌లో కేశినేని నాని ఓటు హ‌క్కు వినియోగానికి సంబంధించి తామే ఓ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. త‌దుప‌రి విచార‌ణ‌ను హైకోర్టు 3 వారాల‌కు వాయిదా వేసింది.


More Telugu News