బీసీసీఐ అనుమతిస్తే.. విదేశీ లీగ్​ లో మెంటార్​ గా ధోనీ!

  • దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ఫ్రాంచైజీని ఏర్పాటు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం
  • జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ అని పేరు పెట్టే యోచన
  • ఈ జట్టుకు ధోనీని మెంటార్ గా నియమించే అవకాశం
భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మరోసారి మెంటార్ అవతారం ఎత్తనున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత జట్టుకు మార్గనిర్దేశం చేసిన ధోనీ ఇప్పుడు మళ్లీ మెంటార్ గా కనిపించబోతున్నాడు. అయితే, అది భారత జట్టుకు కాదు. ఓ విదేశీ లీగ్ జట్టుకు అతను సాయం చేయబోతున్నాడు. త్వరలోనే మొదలయ్యే దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ.. ఓ జట్టును కొనుగోలు చేసింది. దీనికి ఇంకా పేరును ఖరారు చేయలేదు. జోహన్నెస్‌బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఐపీఎల్ లో కెప్టెన్ గా చెన్నైని విజయవంతమైన జట్టుగా నిలిపిన ధోనీ.. ఇప్పుడు ఈ టీమ్ కు తను మెంటార్ గా, హెచ్ కోచ్‌గా స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

తమ జట్టు పేరుతో పాటు ఈ ఇద్దరి నియామకంపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. అయితే, దక్షిణాఫ్రికా లీగ్ లో ధోనీ భాగం అవ్వాలంటే ముందుగా బీసీసీఐ నుంచి అనుమతి లభించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి భారత జట్టు క్రికెటర్లు ఐపీఎల్ మినహా ఇతర దేశాల లీగ్స్ లో ఆడటంపై బీసీసీఐ నిషేధం విధించింది. రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు కోరితే మాత్రం ఎన్ఓసీ మంజూరు చేస్తోంది. ధోనీకి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. మరోవైపు దక్షిణాఫ్రికా లీగ్ తో పాటు యూఏఈ ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ జట్లను కొనుగోలు చేసింది. ఈ రెండు జట్లకు వరుసగా ఎంఐ కేప్‌ టౌన్‌, ఎంఐ ఎమిరేట్స్‌గా పేరు పెట్టింది.


More Telugu News