అటల్ పెన్షన్ యోజనలో పన్ను చెల్లింపుదారుల చేరికపై నిషేధం

  • నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం
  • అక్టోబర్ 1 నుంచి అమల్లోకి
  • కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్
  • పన్ను ఆదాయం ఉందని బయటపడితే ఖాతా క్లోజ్
అటల్ పెన్షన్ యోజన పింఛను పథకంలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు చేరకుండా నిబంధనల్లో కేంద్ర సర్కారు మార్పులు చేసింది. 2022 అక్టోబర్ 1 నుంచి ఈ నూతన నిబంధన అమల్లోకి రానుంది. 

పన్ను చెల్లింపుదారులకు అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అర్హత ఉండదు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవేళ అక్టోబర్ 1, ఆ తర్వాత అటల్ పెన్షన్ యోజనలో చేరిన వారికి, పన్ను వర్తించే ఆదాయం ఉందని గుర్తిస్తే.. వారి ఖాతాను మూసేసి, అప్పటి వరకు సమకూరిన మొత్తాన్ని వెనక్కిచ్చేయడం జరుగుతుందని తెలిపింది. 

అటల్ పెన్షన్ యోజనలో ఈ ఏడాది జూన్ 4 నాటికి 3.73 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అటల్ పెన్షన్ యోజన అన్నది అసంఘటిత రంగంలోని వారికి పదవీ విరమణ అనంతరం ప్రతి నెలా పింఛను చెల్లించే పథకం. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఎవరైనా చేరొచ్చు. 18-40 ఏళ్ల వరకు చేరేందుకు అనుమతి ఉంటుంది. 60 ఏళ్ల వరకు ప్రతి నెలా కొంత మొత్తం జమ చేయాలి. ఆ తర్వాత నుంచి జీవించి ఉన్నంతకాలం రూ.1,000-5,000 మధ్య పెన్షన్ అందుకోవచ్చు.


More Telugu News