చైనా బడ్జెట్ ఫోన్ల నిషేధం వార్తలపై స్పందించిన కేంద్రం

  • పొరుగుదేశం కంపెనీలపై నిషేధం ప్రతిపాదన లేదు
  • కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాల స్పష్టీకరణ
  • రూ.12 వేల లోపు ఫోన్లను నిషేధించొచ్చంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు
చైనా ఫోన్లపై నిషేధం విధించనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర సర్కారు స్పందించింది. దేశీయ సంస్థలను కాపాడుకునేందుకు, దేశీ తయారీని ప్రోత్సహించేందుకు రూ.12 వేల లోపు ధర ఉన్న చైనా ఫోన్లపై కేంద్ర సర్కారు నిషేధం విధించనుందంటూ వార్తలు రావడం తెలిసిందే. 

ఆరంభ ధరల మొబైల్ ఫోన్ల మార్కెట్లో పొరుగు దేశం కంపెనీలను నిషేధించే ఎటువంటి ప్రతిపాదన లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ‘‘ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వద్ద ఇటువంటి ప్రణాళిక పరిశీలనలో లేదు’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. మన దేశంలో అమ్ముడుపోయే మొత్తం ఫోన్లలో 63 శాతం రూ.12 వేల లోపు ధరవే ఉంటున్నాయి. 

2020 గల్వాన్ లోయలో ఇరు దేశ సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ తర్వాత కేంద్ర సర్కారు చైనాపై పరోక్ష యుద్ధాన్ని ప్రారంభించడం తెలిసిందే. వందలాది చైనా యాప్ లను నిషేధించింది. అందులో ఎంతో పాప్యులర్ అయిన వీచాట్, టిక్ టాక్, పబ్ జీ వంటివీ ఉన్నాయి. ఆ తర్వాత చైనా టెలికం నెట్ వర్క్ ఉత్పత్తులను భద్రతా కోణంలో వినియోగించొద్దంటూ టెలికం కంపెనీలను అనధికారికంగా కోరింది. చైనా ఎలక్ట్రానిక్ కంపెనీలపై నిఘా పెట్టి పన్నుల ఎగవేతను వెలుగులోకి తీసుకొచ్చింది. చైనా నుంచి దిగుమతులు తగ్గించుకునేందుకు స్థానిక తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తోంది.


More Telugu News