ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలవరం.. వేగంగా వ్యాపిస్తోందన్న వైద్యులు

  • ఆసుపత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయంటున్న వైద్యులు
  • ఇప్పటికే కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నవారిలోనూ కొత్త వేరియంట్ ప్రభావం
  • శరీరంలో రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుని మరీ వ్యాపిస్తోందని వెల్లడి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ప్రధాన వేరియంట్ అయిన ఒమిక్రాన్ లో కొత్త సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. దీనిని ఒమిక్రాన్ బీఏ 2.75 వేరియంట్ గా పిలుస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. అధికారులు పెద్ద సంఖ్యలో శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించి పరిశీలించారు. ఈ క్రమంలో చాలా శాంపిళ్లలో కొత్త ఉప వేరియంట్ ఉన్నట్టుగా బయటపడిందని ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ ప్రకటించారు. 

ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి..
“ఢిల్లీలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 2.75 వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్టు నివేదికల్లో వెల్లడైంది. ఇది మిగతా వేరియంట్లతో పోల్చితే మరింత వేగంగా వ్యాపిస్తుంది. ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో ఇటీవల 90 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా.. కొత్త వేరియంట్ విషయం బయటపడింది. ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకుని శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడిన వారికి కూడా ఈ కొత్త వేరియంట్ సోకుతోందని తేలింది” అని డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.
  • ఈ కొత్త వేరియంట్ శరీరంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకుని మరీ సోకుతోందని, వేగంగా ఇతరులకు వ్యాపిస్తోందని పేర్కొన్నారు. అయితే కొత్త వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు మరీ ప్రమాదకరంగా ఏమీ ఉండటం లేదని తెలిపారు.
  • కానీ 60 ఏళ్లు దాటినవారు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఢిల్లీలో భారీగా కేసులు..
ఢిల్లీలో కొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులో 2,445 కోవిడ్ కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు 15.41గా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది.


More Telugu News