సీజేఐగా జ‌స్టిస్ ల‌లిత్ నియామ‌కం... ఈ నెల 27న ప‌ద‌వీ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

  • సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేస్తున్న జ‌స్టిస్ ల‌లిత్‌
  • ఈ నెల 26న సీజేఐగా ప‌దవీ విర‌మ‌ణ చేయ‌నున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
  • 49వ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న జ‌స్టిస్ ల‌లిత్‌
భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 27న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ల‌లిత్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌ర్వాత సీనియ‌ర్ మోస్ట్ న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ల‌లిత్ ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే.

సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఈ నెల 26న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో త‌న త‌ర్వాత సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ల‌లిత్‌ను జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సిఫార‌సు చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సిఫార‌సు ఆధారంగా జ‌స్టిస్ ల‌లిత్‌ను సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మిస్తున్న‌ట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రప‌తికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది. ఈ ప్రతిపాద‌న‌ల‌కు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము బుధ‌వారం ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రప‌తి ఆమోద ముద్ర‌తో జ‌స్టిస్ ల‌లిత్‌ను దేశ 49వ ప్ర‌ధాన న్యాయమూర్తిగా నియ‌మిస్తున్న‌ట్లుగా కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.


More Telugu News