వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో ఒరిజిన‌ల్ కాదు: అనంతపురం ఎస్పీ ప్ర‌క‌ట‌న‌

  • మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించిన అనంత ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌
  • ఇంగ్లండ్ నుంచి అప్‌లోడ్ అయ్యింద‌న్న ఎస్పీ
  • ఇంగ్లండ్‌లోనే వీడియోను ఎడిట్ చేశార‌ని వెల్ల‌డి
  • తొలుత ఐటీడీపీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ అయ్యింద‌ని వివ‌ర‌ణ‌
  • ఒరిజిన‌ల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంప‌గ‌ల‌మ‌న్న ఎస్పీ
ఏపీలో పెను చ‌ర్చ‌కు దారి తీసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు చెందిన‌దిగా సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న వీడియోపై బుధ‌వారం రాష్ట్ర పోలీసు శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎంపీ గోరంట్ల వీడియోగా చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వీడియో ఒరిజినల్ కాద‌ని ఆ శాఖ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బుధ‌వారం సాయంత్రం అనంత‌పురంలో మీడియా ముందుకు వ‌చ్చిన జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ వీడియో ప‌లుమార్లు షేర్ అయినందువ‌ల్ల‌... ఆ వీడియో ఒరిజిన‌లా?, ఫేకా? అన్న విష‌యాన్ని తేల్చ‌డం క‌ష్టంగా మారింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ఎంపీకి చెందిన‌దిగా భావిస్తున్న ఈ వీడియో ఇంగ్లండ్‌లో రిజిష్ట‌ర్ అయిన నెంబ‌రు నుంచి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ అయ్యింద‌ని ఫ‌కీర‌ప్ప చెప్పారు. ఈ వీడియో తొలుత ఐటీడీపీకి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో షేర్ అయ్యింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశామ‌న్నారు. 

ఈ వీడియోను ఇంగ్లండ్‌లోనే అప్‌లోడ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంద‌న్నారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన వ్య‌క్తి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నామ‌న్నారు. ఇక ఈ వీడియో ఒరిజిన‌లా?, న‌కిలీనా? అన్న‌ది తేల్చాలంటే ఒరిజిన‌ల్ వీడియో అందుబాటులో ఉంటేనే సాధ్య‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఒరిజిన‌ల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగ‌ల‌మ‌ని ఎస్పీ తెలిపారు.


More Telugu News