అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకు ఒకే చార్జర్... కేంద్రం యోచన

  • వివిధ ఎలక్ట్రానిక్ డివైస్ లకు పలు రకాల చార్జర్లు
  • ఒక్కో కంపెనీ వస్తువుకు ఒక్కో తరహా చార్జర్
  • ఈ విధానం మార్చేందుకు కేంద్రం ప్రణాళిక
  • స్మార్ట్ ఫోన్, ట్యాబ్ ఏ కంపెనీ అయినా ఒకటే చార్జర్
దేశంలో అనేక ఎలక్ట్రానిక్ కంపెనీల ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర గాడ్జెట్లు వినియోగంలో ఉన్నాయి. వీటికి విద్యుత్ చార్జింగ్ తప్పనిసరి. అయితే, ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా చార్జర్ లను రూపొందించడం తెలిసిందే. పైగా, స్మార్ట్ ఫోన్లకు, ట్యాబ్ లకు, పవర్ బ్యాంకులకు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ లకు చార్జర్లు భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర పరికరాలన్నింటికి ఒకే చార్జర్ తీసుకురానుంది. 

దీనిపై చర్చించేందుకు కేంద్రం ఈ నెల 17న సమావేశం ఏర్పాటు చేసినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఒక్కో డివైస్ కు ఒక్కో చార్జర్ ఉండడం, తద్వారా దేశంలో ఈ-వేస్ట్ పెరిగిపోవడం వంటి సమస్యలకు స్వస్తి పలికేందుకు కేంద్రం ఏక చార్జర్ విధానాన్ని తీసుకురానుంది. 

ఇటీవలే యూరోపియన్ యూనియన్ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 2024 నుంచి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలకు కామన్ చార్జింగ్ (యూఎస్ బీ టైప్ సీ-పోర్ట్) ప్రమాణాలు అమలు చేయాలని సంకల్పించింది. అమెరికాలోనూ ఇలాంటి ప్రతిపాదనలే వినిపిస్తున్నాయి.

 యూరప్, అమెరికాలో ఇలాంటి కామన్ చార్జర్ విధానానికి కంపెనీలు ఆమోదం తెలిపితే, భారత్ లో ఎందుకు సాధ్యం కాదు? అని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఆ అధికారి అభిప్రాయపడ్డారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ ల వంటి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు కామన్ చార్జర్ ఉండాలి అని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ప్రజలు ఏదైనా కొత్త డివైస్ కొంటే తప్పనిసరిగా దానికి అనుగుణమైన చార్జర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కామన్ చార్జర్ విధానం తీసుకురాకపోతే, రకరకాల చార్జర్లు భారత్ లో వెల్లువెత్తుతాయని సదరు అధికారి వివరించారు.


More Telugu News