థియేటర్లలో సినిమాలు ఆడకపోవడానికి మనమే కారణం: ఆమిర్ ఖాన్

  • ఓటీటీల వల్ల సినిమాలకు నష్టం లేదన్న ఆమిర్ 
  • రెండు, మూడు వారాలకే సినిమా ఓటీటీల్లోకి రాకూడదని సూచన 
  • 6 నెలల  తర్వాత సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయాలని సలహా 
బాలీవుడ్ స్టార్లలో వైవిధ్య భరితమైన పాత్రలను పోషించడంలో ఆమిర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతున్నాయి. ఈ చిత్రంలో కరీనా కపూర్, టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో అందరూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ... సినిమాలు థియేటర్లలో ఆడకపోవడంపై తన అభిప్రాయాలని వెల్లడించారు. 

థియేటర్లలో సినిమాలు ఆడకపోవడానికి ఓటీటీల తప్పు లేదని ఆమిర్ అన్నారు. వాస్తవానికి సినీ పరిశ్రమకు ఓటీటీలు ఎంతో మేలు చేస్తాయని... వాటి వల్ల ప్రమాదం లేదని చెప్పారు. తప్పు మనమే చేస్తున్నామని... సినిమాలు విడుదలైన రోజుల వ్యవధిలోనే ఓటీటీల్లోకి వచ్చేస్తుంటే... జనాలు థియేటర్లకు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. హాయిగా ఇంటి వద్దే కూర్చొని సినిమాలు చూద్దామని అనుకుంటారని చెప్పారు.  

సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత ఓటీటీల్లోకి విడుదల చేయాలని... అలాంటప్పుడు సినిమాకు హిట్ టాక్ వస్తే ప్రేక్షకులు ఆటోమేటిక్ గా థియేటర్లకు వస్తారని ఆమిర్ తెలిపారు. అందుకే రెండు, మూడు వారాల్లోనే సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయడాన్ని మానుకోవాలని సూచించారు.


More Telugu News