కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధు పసిడి విజయంపై తల్లిదండ్రుల స్పందన

  • కామన్వెల్త్ క్రీడల్లో సింధుకు స్వర్ణం
  • బ్యాడ్మింటన్ లో మహిళల సింగిల్స్ విజేతగా సింధు
  • సింధుపై అభినందనల వర్షం
  • పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న వెంకటరమణ, విజయ
తెలుగుతేజం పీవీ సింధు బ్రిటన్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ స్వర్ణం గెలవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సింధు విజయంపై ఆమె తల్లిదండ్రులు స్పందించారు. పుత్రికోత్సాహంతో వారు పొంగిపోతున్నారు. 

సింధు తండ్రి వెంకటరమణ మాట్లాడుతూ, తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. సింధు 2014 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గిందని, 2018లో రజతం గెలిచిందని, ఇప్పుడు స్వర్ణం సాధించిందని చెబుతూ మురిసిపోయారు. సింధు తన కలను నిజం చేసుకోవడం పట్ల తమకు సంతృప్తిగా ఉందని వెల్లడించారు. నేడు జరిగిన ఫైనల్లో పాయింట్ల లీడ్ ను చివరివరకు కొనసాగిస్తూ తమకు టెన్షన్ లేకుండా చేసిందని అన్నారు. 

సింధు తెలంగాణలో పుట్టిందని, ఏపీ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తోందని వెంకటరమణ వెల్లడించారు. సింధు రెండు రాష్ట్రాలను సమదృష్టితో చూస్తుందని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్ల లాంటివని అన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సింధును సమానంగా ఆదరించి ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. 

సింధు తల్లి విజయ కూడా తన బిడ్డ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సింధు ఈ ఫైనల్ కు ముందు కాలు నొప్పికి గురైందని, దాంతో ఫైనల్స్ ఎలా ఆడుతుందో అన్న ఆందోళన కలిగిందని వివరించారు. అయితే, నొప్పి తాలూకు బాధను ఎక్కడా కనిపించనివ్వకుండా సింధు అంచనాలకు తగినట్టుగా ఆడిందని హర్షం వెలిబుచ్చారు. పిల్లలను వాళ్లకు ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి సింధునే నిదర్శనమని తెలిపారు.


More Telugu News