కుక్కపిల్లను రక్షించేందుకు కొండ చిలువతో ముగ్గురు చిన్నారుల పోరాటం.. వైరల్‌ వీడియో ఇదిగో..

  • చైనాలో కుక్కను చుట్టేసి తిన బోయిన కొండ చిలువ..
  • అది చూసి చేతికందిన దానితో కొండ చిలువను కొట్టిన పిల్లలు
  • లాఘవంగా దాని తల పట్టుకున్న ఒకరు.. మిగతా ఇద్దరు కలిసి కుక్కను విడదీసిన వైనం
  • ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో
వారు ముగ్గురు చిన్నారులే.. మహా అయితే ఎనిమిది నుంచి పదేళ్ల మధ్య వయసు ఉంటుందేమో. కానీ వారు చేసిన పని చూస్తే మాత్రం అబ్బో అనుకోవాల్సిందే. తమ కుక్కను చుట్టేసి తినేందుకు సిద్ధమైన ఓ కొండ చిలువతో ఆ ముగ్గురు చిన్నారులు పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. చైనాలో జరిగిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొండ చిలువతో తల పట్టేసి..
  • చైనాలోని ఓ గ్రామంలో కొండ చిలువ కుక్కను పట్టేసుకుంది. దాని చుట్టూ చుట్టేసి తినేసేందుకు సిద్ధమైంది. ఇంతలో ఆ కుక్కను పెంచుకునే ముగ్గురు చిన్నారులు అక్కడికి వచ్చారు. వెంటనే కుక్కను రక్షించేందుకు రెడీ అయిపోయారు.
  • చుట్టుపక్కల కనిపించిన చిన్న కర్రలు, రాళ్లు పట్టుకుని కొండ చిలువను కొట్టడం మొదలుపెట్టారు. దీంతో కుక్కను పట్టేసుకుని కూడా ఆ కొండ చిలువ ఆ పిల్లల వైపు దూకుతున్నట్టుగా చేస్తూ భయపెట్టింది. అయినా పిల్లలు వెనక్కి తగ్గలేదు.
  • ఇంతలో ఒక బాలుడు ఓ గట్టి కర్రను కొండ చిలువ తల వద్ద గట్టిగా పెట్టి ఒత్తి పట్టుకున్నాడు. లాఘవంగా దాని తలను దొరకబుచ్చుకుని గట్టిగా లాగాడు. వెంటనే మిగతా ఇద్దరు వచ్చి.. కొండ చిలువ పట్టు నుంచి కుక్కను విడదీయడం మొదలుపెట్టారు.
  • మొదటి పిల్లాడు తల భాగం గట్టిగా పట్టుకుని ఓ వైపు లాగగా.. మరొకరు తోక భాగం పట్టుకుని లాగుతూ, మరొకరు మధ్య భాగం నుంచి విడదీసేందుకు ప్రయత్నించారు.
  • కొండ చిలువ బలంగా పట్టుకుని ఉండటంతో వారు కొంత సేపు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. చివరికి పాము పట్టు నుంచి కుక్క పిల్లను కాపాడారు. విడదీయగానే ఆ కుక్క పిల్ల ఒకటే పరుగు.

ఆ తెగువ అసామాన్యం!
మామూలుగా మనం పాము కనబడితేనే చాలు వామ్మో అంటూ అంత దూరం పరుగెడతాం. అలాంటిది ముగ్గురు పిల్లలు చూపిన తెగువను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ‘అమ్మో ఆ పిల్లలు చాలా ధైర్యవంతులు’ అని కొందరు.. ‘ఏమైనా తమ కుక్క పిల్లను కాపాడుకునేదాకా వదల్లేదు. వారి ధైర్యానికి సెల్యూట్’ అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు ఇంటర్నెట్ లో లక్షల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.


More Telugu News