మాధవ్ వీడియో వ్యవహారం అరగంటలో తేలిపోతుందంటున్నారు... చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు: సజ్జల

  • ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ దుమారం
  • విమర్శనాస్త్రాలు సంధిస్తున్న టీడీపీ నేతలు
  • వీడియో ఒరిజినలో, కాదో తేలాల్సి ఉందన్న వైసీపీ
  • అందుకు అరగంటో, గంటో చాలన్న టీడీపీ నేతలు
  • చంద్రబాబు వ్యవహారం ఏడేళ్లయినా తేలలేదన్న సజ్జల
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ దుమారంపై స్పందించారు. ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్ పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. 

అయితే, ఆ వీడియో ఒరిజనలో, కాదో తెలుసుకోవడానికి అరగంటో, గంటో చాలని అంటున్నారని, నాడు చంద్రబాబునాయుడు పక్కా ఆధారాలతో దొరికిపోయిన ఓటుకు నోటు వ్యవహారమే ఇప్పటికీ తేలలేదని సజ్జల అన్నారు. చంద్రబాబుకు ఆనాడు అంతరంగికుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ కేసులో ఉన్నారని, స్టీఫెన్ సన్ కు బ్యాగు ఇవ్వడం ఉందని, మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు ఒరిజినల్ వాయిస్ కూడా ఉందని వివరించారు. ఆ వాయిస్ కు తగినట్టు అవతల డబ్బులు ఇచ్చిన ఘటన కూడా జరిగిందని అన్నారు. 

ఆ వాయిస్ చంద్రబాబుదేనని అందరికీ తెలుసని, కానీ ఆయన ఒప్పుకోవడంలేదని అన్నారు. ఇందులో అన్ని ఆధారాలు ఉన్నా ఈ కేసు ఏడేళ్లయినా తెమలడంలేదని తెలిపారు. కానీ, గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అవతలి వాళ్లెవరో తెలియదని, ఆ వీడియోలో అభ్యంతరకరంగా చూపించిన భాగంలో ఉన్నది మార్ఫింగ్ చేశారని మాధవ్ అంటున్నారని సజ్జల వివరించారు. మాధవ్ అంశంలో ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని, అటు చంద్రబాబునాయుడు అంశంలో పెద్ద కేసే నడుస్తోందని పేర్కొన్నారు. 

మాధవ్ కు సంబంధించి ఒరిజినల్ బయటికి రాలేదని, ఆ వీడియోను ఇంకో వీడియోగా షూట్ చేసింది మాత్రం బయటికొచ్చిందని సజ్జల వెల్లడించారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అన్నీ ఒరిజినల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు ఒక పార్టీకి అధినేత అని, మాజీ ముఖ్యమంత్రి అని, ఏదో సామాన్య కార్యకర్త కాదని తెలిపారు. ఎన్నికల వ్యవస్థనే భ్రష్టుపట్టించే విధంగా, రాజ్యాంగాన్నే అవహేళన చేసేవిధంగా వ్యవహరించారని విమర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కాబట్టి ఓటుకు నోటు కేసు తేలాలని అన్నారు. 

"ఆ వాయిస్ గురించి ఇక్కడ ఈయన (చంద్రబాబు) అన్నా చెప్పాలి, లేకపోతే అక్కడ ఆయన (కేసీఆర్) అన్నా చెప్పాలి. పెట్టేబేడా సర్దుకుని ఊరు వదిలిపోతే నేనేమీ బయటికి తీయను అని ఆయన (కేసీఆర్) అన్నాడేమో తెలియదు కానీ, రాత్రికి రాత్రి ఆయన ఊరు వదిలి వచ్చేశాడు. ఈ చరిత్ర అందరికీ తెలుసు. ముందు తేలాల్సింది ఇది. ఎంపీ మాధవ్ వ్యవహారం కంటే ఇదే పెద్ద విషయం" అని సజ్జల స్పష్టం చేశారు. 

మాధవ్ తప్పు చేశాడని తేలితే చర్యలు ఉంటాయని ముందే చెప్పామని, జగన్ కూడా మాటపై నిలబడతారని సజ్జల పేర్కొన్నారు. ఈ వీడియో వ్యవహారంలో కొంచెం వేచిచూసినంత మాత్రాన కొంపలేమీ అంటుకుపోవు అని వ్యాఖ్యానించారు. ఇవే కాకుండా ఇంకా అనేక అంశాలు ఉన్నాయని, వాటిపై దృష్టిసారిస్తే మేలని హితవు పలికారు. టీడీపీ వాళ్ల చిట్టా తీస్తే బూతుపురాణాలు చాలానే ఉన్నాయని, వాటిలోకి వెళ్లడం తనకు ఇష్టంలేదని సజ్జల పేర్కొన్నారు.


More Telugu News