కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం

  • పదిమందిలో ముగ్గురిని గుర్తించిన పోలీసులు
  • స్థానిక చట్టాలు ఉల్లంఘించకపోవడంతో చర్యలు తీసుకోని పోలీసులు
  • గతంలోనూ ఇలానే అదృశ్యమైన శ్రీలంక క్రీడాకారులు
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక క్రీడాకారుల బృందం నుంచి పదిమంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిదిమంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. 

గత వారం నుంచే ముగ్గురు కనిపించకుండా పోయారని, ఆ తర్వాత మరో ఏడుగురు అదృశ్యమయ్యారని పేర్కొన్న ఆయన క్రీడాకారుల అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు 160 మందితో కూడిన శ్రీలంక క్రీడాకారుల బృందం బర్మింగ్‌హామ్ చేరుకుంది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రీడాకారుల కోసం గాలించగా తొలుత అదృశ్యమైన ముగ్గురు.. జుడోకా చమీలా దిలాని, ఆమె మేనేజర్ అసేల డి సిల్వా, రెజ్లర్ షనిత చతురంగలను గుర్తించారు. అయితే, స్థానిక చట్టాలను వారు ఉల్లంఘించలేదని గుర్తించారు. అలాగే, వారి వద్ద చెల్లుబాటు అయ్యే వీసాలు ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీలంక అధికారి తెలిపారు. 

అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు వెళ్లిన శ్రీలంక క్రీడాకారులు గతంలోనూ అదృశ్యమైన ఘటనలు ఉన్నాయి. నార్వేలోని ఓస్లోలో గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నమెంటులో పాల్గొనేందుకు వెళ్లిన క్రీడా బృందానికి చెందిన రెజ్లింగ్ మేనేజర్ అదృశ్యమయ్యాడు. అంతకుముందు 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు మాయమయ్యారు. ఇక, జాడలేకుండా పోయిన మిగతా ఏడుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


More Telugu News