పాపం రాహుల్ చౌదరి.. రూ. 1.29 కోట్ల నుంచి 10 లక్షలకు పడిపోయిన ప్రొ కబడ్డీ హీరో

  • రూ. 2.26 కోట్లు పలికిన పవన్‌ షెరావత్‌ 
  • ప్రో కబడ్డీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పవన్
  • భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన తమిళ్ తలైవాస్ జట్టు
  • ప్రో కబడ్డీ తొమ్మిదో సీజన్ కోసం ముగిసిన వేలం
ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. క్రికెట్ తర్వాత దేశంలో అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన లీగ్ గా నిలిచింది. ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ కు రెడీ అయింది. ఇందుకు సంబంధించి ఆటగాళ్ల వేలం ముంబైలో  నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన వేలంలో సరికొత్త రికార్డు బద్దలయ్యాయి. ఐపీఎల్ ప్లేయర్ ఆక్షన్ ను తలపించేలా  వేలం సాగింది.సత్తా ఉన్న ప్లేయర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. 

ఈ క్రమంలో  ప్రో కబడ్డీ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్‌ రైడర్‌ పవన్‌ షెరావత్‌ రికార్డు సృష్టించాడు. షెరావత్‌ను తమిళ్‌ తలైవాస్‌ జట్టు ఏకంగా రూ. 2.26 కోట్లకు సొంతం చేసుకుంది. దాంతో, గతేడాది రూ. 1.65 కోట్లు పలికిన పర్దీప్‌ నర్వాల్‌ (యూపీ యోధా) రికార్డును షెరావత్ బ్రేక్‌ చేశారు.  బెంగళూరు బుల్స్‌ వికాస్‌ ఖండోలాను రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది.  పుణెరి పల్టాన్‌ జట్టు ఇరాన్కు చెందిన డిఫెండర్  ఫజల్‌ అత్రాచలి కోసం రూ. 1.38 కోట్లు ఖర్చు చేసింది. గున్మన్‌ సింగ్ (యు ముంబా రూ. 1.21 కోట్లు), పర్దీప్‌ నర్వాల్‌ (యూపీ యోధాస్‌ రూ. 90 లక్షలు) ఎక్కువ ధర పలికారు. 

ఈ సీజన్ వేలంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు తెలుగు టైటాన్స్ జట్టు కు ఆడి ఎంతో స్టార్ డమ్ తెచ్చుకున్న రైడర్ రాహుల్ చౌదరి రేటు అమాంతం పడిపోయింది. 2018 వేలంలో రూ. 1.29 కోట్లు పలికిన రాహుల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. అతను ఈ సారి ప్రారంభ ధర రూ. 10 లక్షలు మాత్రమే పలికాడు. చివరకు జైపూర్‌ పింక్ పాంథర్స్ కారు చౌకగా  కొనుగోలు చేసింది.


More Telugu News