దిష్టిబొమ్మను కాదు.. దేశాన్ని కాల్చండి: టీడీపీ నేతలపై కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ మండిపాటు

  • గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుప్పంలో టీడీపీ ఆందోళన
  • దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా అడ్డుకున్న సీఐ
  • చంద్రబాబు పీఏ.. సీఐ శ్రీధర్‌కు మధ్య వాగ్వివాదం
  • చంద్రబాబు పీఏ మనోహర్ సహా 15 మందిపై కేసులు
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కుప్పంలో ఆందోళన నిర్వహించిన టీడీపీ నేతలు మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకుని దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. దీంతో టీడీపీ నేతలు, కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ మధ్య వాగ్వివాదం చోటుచేసింది. అనుమతి లేకుండా దిష్టిబొమ్మను ఎలా దహనం చేస్తారని టీడీపీ చీఫ్ చంద్రబాబు పీఏ మనోహర్‌ను సీఐ ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టినట్టు చెప్పారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేస్తే తప్పేంటని, ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ మీ స్నేహితుడని అడ్డుకుంటున్నారా? అని నిలదీశారు.

దీనికి సీఐ బదులిస్తూ.. ఎంపీ నా స్నేహితుడు కాదని, విధుల్లో భాగంగానే అడ్డుకుంటున్నట్టు చెప్పారు. ఇలా చేసేవారు చాలామందే ఉంటారని, మీరు చేయలేదా? అని ప్రశ్నించారు. ఎంపీ తప్పు చేశారని తేలితే చట్టబద్ధంగా శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ‘‘తప్పు చేస్తే దిష్టిబొమ్మను కాలుస్తారా?.. అయినా, దిష్టిబొమ్మనెందుకు దేశాన్ని కాల్చండి’’ అని మనోహర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మనోహర్ సహా 15 మంది టీడీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


More Telugu News