తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

  • బంగాళాఖాతంలో నిన్న సాయంత్రం అల్పపీడనం
  • దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం
  • అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని హెచ్చరిక
  • ఒక్కసారిగా కుండపోత వానలు పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో నిన్న సాయంత్రం ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల్లో కుండపోత వాన కురుస్తుందని పేర్కొంది. 

వర్షాలు పడుతున్న సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వివరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. నిన్న కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా అక్కెనపల్లి, పాత మంచిర్యాలలో 9.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.


More Telugu News