కోలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం... వివరాలు ఇవిగో!

  • నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లే టార్గెట్
  • పలువురి కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు
  • 40 చోట్ల తనిఖీలు
  • రూ.200 కోట్ల మేర లెక్కలు చూపని ఆదాయం
తమిళ చిత్ర పరిశ్రమ కోలీవుడ్ లో ఐటీ దాడులు జరిగాయి. స్టార్ ప్రొడ్యూసర్లు ఎస్సార్ ప్రభు, కలైపులి ఎస్.థాను, జ్ఞానవేల్ రాజా, అన్బుచెళియన్ ల కార్యాలయాల్లో గత మూడ్రోజులుగా ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. చెన్నైలోనే కాకుండా కోయంబత్తూరు, మధురై వంటి ప్రాంతాల్లో మొత్తం 40 చోట్ల తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా, నిర్మాత అన్బుచెళియన్ బంధువుల నివాసాలను కూడా ఐటీ అధికారులు వదల్లేదు. నిర్మాతల కార్యాలయాల్లోనే కాదు, సినీ ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల నివాసాల్లోనూ ఐటీ దాడులు జరిగాయి. 

మొత్తమ్మీద రూ.200 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. ఈ అప్రకటిత ఆదాయానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, డిజిటల్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నట్టు బోర్డు వివరించింది. సినిమాల విడుదల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిర్మాతలు తక్కువగా చూపించారని, ఇక థియేటర్ల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఆ ఆదాయానికి లెక్కలు చూపలేదని వెల్లడించింది. ఈ మేరకు ఐటీ దాడుల్లో ఆధారాలు బయటపడ్డాయని తెలిపింది.


More Telugu News