కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్‌రెడ్డికి సారీ చెప్పిన అద్దంకి ద‌యాక‌ర్‌

  • చండూరు స‌భ‌లో నోరు జారిన అద్దంకి
  • ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోమ‌టిరెడ్డి అభిమానులు
  • పీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీకి ఫిర్యాదు
  • క‌మిటీ చైర్మ‌న్ చిన్నారెడ్డి సాక్షి సంత‌కంతోనే అద్దంకికి నోటీసులు
  • ఎంపీకి వ్య‌క్తిగ‌తంగా క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌న్న ద‌యాక‌ర్‌
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి ఆయ‌న సొంత పార్టీకి చెందిన కీల‌క నేత అద్దంకి ద‌యాక‌ర్ శ‌నివారం క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారాన్ని నిర‌సిస్తూ శుక్ర‌వారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మునుగోడులోని చండూరులో కాంగ్రెస్ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు హాజ‌రైన తుంగ‌తుర్తికి చెందిన అద్దంకి ద‌యాక‌ర్‌... వెంక‌ట్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

అద్దంకి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోమ‌టిరెడ్డి అభిమానులు టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ స‌భ‌కు క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ చిన్నారెడ్డి కూడా హాజ‌రైన నేప‌థ్యంలో ఆయ‌నే సాక్షిగా అద్దంకికి పార్టీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. సొంత పార్టీ ఎంపీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు వారంలోగా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో కాంగ్రెస్ పార్టీ అదేశించింది.

ఈ నోటీసులు అందుకున్న మ‌రుక్ష‌ణ‌మే ద‌యాక‌ర్ స్పందించారు. తాను ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడాన‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. వెంక‌ట్ రెడ్డికి వ్యక్తిగ‌తంగా క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు ద‌యాక‌ర్ తెలిపారు. తన వ్యాఖ్య‌ల ప‌ట్ల బాధ ప‌డుతున్న కోమ‌టిరెడ్డి అభిమానులు త‌న‌ను క్ష‌మించాల‌ని ఆయ‌న కోరారు. పార్టీకి న‌ష్టం చేయాల‌న్న ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని కూడా ఆయ‌న తెలిపారు. త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేలోగానే షోకాజ్ నోటీసు జారీ అయ్యింద‌ని, భ‌విష్య‌త్తులో మ‌రోమారు ఇలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.


More Telugu News