మరో నాలుగేళ్లలో రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్

  • ఎలక్ట్రిక్ బైకులకు పెరుగుతున్న డిమాండ్
  • ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం
  • విద్యుత్ వాహనాలతో కాలుష్య నివారణ
  • 2025-26 నాటికి రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్
ప్రముఖ వాహన తయారీ సంస్థలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బాటపడుతున్నాయి. పర్యావరణ హిత వాహనాల తయారీని అనేక దేశాల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అంతకంతకు పెరిగిపోతున్న కాలుష్య నివారణకు విద్యుత్ ఆధారిత వాహనాలే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా మరో నాలుగేళ్లలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ప్రవేశించనుంది.

దీనిపై రాయల్ ఎన్ ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ స్పందించారు. 2025-26 నాటికి తమ కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి తీసుకువస్తామని వెల్లడించారు. అందుకోసం ప్రత్యేకంగా గడువు అంటూ ఏమీ లేదని, అయితే కచ్చితంగా ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

ఎలక్ట్రిక్ కాన్సెప్టు బైక్ పై ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో పరిశోధన జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫాంలపై విద్యుత్ ఆధారిత బైక్ ను నిర్మించడమా, లేక కొత్త ప్లాట్ ఫాం రూపొందించడమా అనేది చర్చిస్తున్నామని వివరించారు.


More Telugu News