గోరంట్ల మాధవ్ పై ఇంకా చర్యలు తీసుకోకపోవడం ఏంటి?: సోమిరెడ్డి మండిపాటు

  • వైసీపీ ఎంపీ గోరంట్ల నగ్న వీడియో కాల్ దుమారం
  • వేరే ఎవరైనా అయితే ఈపాటికే చర్యలు తీసుకుని ఉండేవారన్న సోమిరెడ్డి    
  • మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్  
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. గోరంట్ల మాధవ్ పై ఇంకా చర్యలు తీసుకోకపోవడం ఏంటని వైసీపీ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే మాధవ్ ను సస్పెండ్ చేసి ఉండాల్సిందని అన్నారు. ఆ వీడియో ఒరిజినలో, కాదో సీఎం జగన్ కు, సకల శాఖల మంత్రి సజ్జలకు కళ్లు కనిపించడంలేదా? అని నిలదీశారు. 

ఎవరైనా అధికారో, లేక విపక్షాలకు చెందినవారో ఏదైనా చేసుంటే ఈపాటికే చర్యలు తీసుకుని ఉండేవారని, సొంత పార్టీ ఎంపీ కాబట్టి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా, పార్లమెంటు విలువ కాపాడాలంటే అతడిని ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. 

"ఏదైనా బూతు సినిమా తీస్తే దాన్ని అడ్డుకునేందుకు చట్టం ఉంది. కానీ ఇవాళ నువ్వు దేశం మొత్తానికి బూతు సినిమా చూపించావు. ఇది దేశ ప్రజలు చేసుకున్న కర్మ! నీ ముఖాన్ని చూడాల్సి వచ్చింది, నీ వేషాలు చూడాల్సి వచ్చింది అంటూ గోరంట్ల మాధవ్ పై మండిపడ్డారు. 

గతంలో ఎస్వీబీసీ చానల్ చైర్మన్ గా వ్యవహరించిన పృథ్వీని ఇలాంటి వ్యవహారంలోనే తొలగించారని సోమిరెడ్డి వెల్లడించారు. తనది చాలా చిన్న సీన్ అని పృథ్వీ ఓ చానల్లో వెల్లడించారని, కానీ అంతకంటే పెద్ద సీన్లు చేసిన వారిని మంత్రులుగా, ఎంపీలుగా కొనసాగిస్తున్నారంటూ విమర్శించారు. ఒకాయన అరగంట అంటాడని, మరొకాయన గంట అంటాడని, ఇప్పుడొక ఎంపీ తయారయ్యాడని వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురినీ కూడా పార్టీ నుంచి తొలగించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. తద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలని సీఎం జగన్ కు సూచించారు.


More Telugu News