హైదరాబాద్ విద్యార్థికి అమెరికా వర్సిటీ నుంచి రూ.1.30 కోట్ల స్కాలర్ షిప్

  • హైదరాబాదులో 12వ తరగతి పూర్తిచేసిన వేదాంత్
  • అమెరికాలో న్యూరోసైన్స్ చదవాలని నిర్ణయం
  • భారీ స్కాలర్ షిప్ ప్రకటించిన కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ
  • వైద్య విద్యలో ప్రపంచ 16వ ర్యాంకులో ఉన్న వర్సిటీ
హైదరాబాద్ కు చెందిన వేదాంత్ ఆనంద్ వాడే అనే విద్యార్థికి అరుదైన అవకాశం లభించింది. అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ నుంచి ఈ కుర్రాడికి రూ.1.30 కోట్ల స్కాలర్ షిప్ అందనుంది. అమెరికాలో న్యూరోసైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు గాను వేదాంత్ కు కేస్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఈ స్కాలర్ షిప్ ను కేటాయించింది. ఈ మేరకు వేదాంత్ కు అంగీకారపత్రంతో పాటు స్కాలర్ షిప్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా పంపించింది. 

వేదాంత్ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఈ నెల 12న అమెరికా వెళ్లనున్నాడు. తనకు అమెరికన్ వర్సిటీ నుంచి భారీ మొత్తంలో స్కాలర్ షిప్ లభించడం పట్ల వేదాంత్ హర్షం వ్యక్తం చేశాడు. వైద్యవిద్యా రంగంలో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందని వెల్లడించాడు. ఈ విశ్వవిద్యాలయంలో చదివినవారిలో 17 మందికి నోబెల్ ప్రైజ్ దక్కిందని తెలిపాడు. ఇప్పుడు తనకు లభించిన స్కాలర్ షిప్ ట్యూషన్ ఫీజు కింద కేటాయించారని వివరించాడు. 

వేదాంత్ హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఓ ప్రైవేటు స్కూల్లో ఐసీఎస్ఈ సిలబస్ తో 12వ తరగతి పూర్తిచేశాడు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారిని భవిష్యత్ తరం నాయకులుగా మలిచేందుకు కృషి చేస్తున్న డెక్స్ టెరిటీ గ్లోబల్ గ్రూప్ వేదాంత్ కు ఈ దిశగా మార్గదర్శనం చేసింది. వేదాంత్ తండ్రి ఓ దంతవైద్యుడు కాగా, తల్లి ఫిజియోథెరపిస్ట్. 



More Telugu News