రేవంత్‌ను సీఎం అంటున్నారు... ఆ 'సీఎం' అంటే 'చంద్ర‌బాబు ముద్దుబిడ్డ‌' అని అర్థం: కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎద్దేవా

  • ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఓడిపోతాయ‌న్న కోమ‌టిరెడ్డి
  • ఆ రెండు పార్టీల్లో నుంచి బీజేపీలోకి నేత‌లు వ‌స్తార‌ని జోస్యం
  • రాజీనామా ఆమోదించ‌కుంటే స్పీక‌ర్ ఇంటి ముందు కూర్చుంటాన‌ని హెచ్చ‌రిక‌
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నుంచి ద‌క్కిన మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై శ‌నివారం మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. రేవంత్‌ను చాలా మంది సీఎం, సీఎం అంటున్నార‌ని ప్రస్తావించిన కోమ‌టిరెడ్డి... ఆ సీఎం అంటే చంద్ర‌బాబు ముద్దుబిడ్డ అని అర్థం అంటూ ఎద్దేవా చేశారు. 

సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్ పార్టీ చేతుల్లో అవ‌మానాల‌కు గురైన చాలా మంది నేత‌లు బీజేపీలో చేర‌తార‌ని ఆయ‌న చెప్పారు. ముంద‌స్తు ఎన్నిక‌లు వస్తే... టీఆర్ఎస్‌, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయ‌మ‌ని రాజ‌గోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. స‌రైన స‌మ‌యంలో త‌న సోద‌రుడు వెంక‌ట్ రెడ్డి కూడా స‌రైన నిర్ణ‌య‌మే తీసుకుంటార‌ని ఆయ‌న చెప్పారు. 

ఒక పార్టీ గుర్తుపై గెలిచి...మ‌రో పార్టీ ఎమ్మెల్యేగా కొన‌సాగేందుకు తాను ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని రాజ‌గోపాల్ రెడ్డి చెప్పారు. ఈ కార‌ణంగానే రాజ్యాంగ‌బ‌ద్ధంగానే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని చెప్పారు. త‌న రాజీనామాను స్పీకర్ ఆమోదించాల్సిందేనని ఆయ‌న తెలిపారు. లేనిప‌క్షంలో స్పీక‌ర్ ఇంటి ముందు కూర్చుంటాన‌ని అన్నారు.

 గ‌డ‌చిన మూడున్న‌రేళ్లుగా త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించిన మునుగోడు ప్ర‌జ‌ల కోసం పోరాడాన‌ని, నియోజ‌కవ‌ర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీ వేదికగా పోరాటం సాగించాన‌ని ఆయ‌న తెలిపారు. చివ‌ర‌కు మంత్రి కేటీఆర్‌ను క‌లిసినా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి టీఆర్ఎస్ స‌ర్కారు నిధులు విడుద‌ల చేయ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు.


More Telugu News