స్కూల్ విద్యార్థినులు రూపొందించిన శాటిలైట్ రేపే అంతరిక్షంలోకి!

  • ఆదివారం ఉదయం 9.18 గంటలకు షార్ నుంచి ప్రయోగం
  • 12 నిమిషాల్లోనే కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఎస్ఎస్ఎల్వీ డీ1
  • ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన రాకెట్ ఎస్ఎస్ఎల్వీ డీ1
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరి కోటలోని షార్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - డెవలప్ మెంటల్ ఫ్లయిట్ 1ను (ఎస్ఎస్ఎల్వీ డీ1) అంతరిక్షంలోకి పంపనుంది. నిర్ణీత సమయానికి ఆరున్నర గంటల ముందు నుంచి కౌంట్ డౌన్ మొదలు కానుంది. 

75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినులు రూపొందించిన ఆజాదిశాట్ శాటిలైట్ ను.. ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ కక్ష్యలోకి తీసుకెళ్లనుంది. స్పేస్ కిడ్జ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ఈ శాటిలైట్ బరువు 8 కిలోలు. కేవలం 12 నిమిషాల్లోనే కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా విద్యార్థినులు ఈ శాటిలైట్ అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. 

ఈ శాటిలైట్ లో ఏర్పాటు చేసిన సెల్ఫీ కెమెరాలు సొంత సోలార్ ప్యానెళ్లను, కమ్యూనికేషన్ ట్రాన్స్ పాండర్లను ఫొటోలు తీస్తాయి. మహిళలను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ లో పాల్గొనేలా ప్రోత్సహించడమే అజాదిశాట్ అభివృద్ధి వెనుక లక్ష్యంగా స్పేస్ కిడ్జ్ చీఫ్ టెక్నాలజీ అధికారి రిఫత్ షరూక్ తెలిపారు. ఎస్ఎస్ఎల్వీ డీ1 అన్నది ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన రాకెట్.


More Telugu News