ప్రొఫెస‌ర్‌ జయశంకర్‌తో కేటీఆర్‌!.. త‌న‌కిష్ట‌మైన ఫొటోలలో ఇదొకటి అంటూ పోస్ట్ చేసిన తెలంగాణ మంత్రి!

  • 2009లో జ‌య‌శంకర్ ఇంటిలో కేటీఆర్ నిర‌స‌న హోరు
  • కేసీఆర్ అరెస్ట్ త‌ర్వాత నిర‌స‌న‌కు దిగిన‌ట్లు చెప్పిన కేటీఆర్‌
  • ఆ మ‌రునాడే జ‌య‌శంక‌ర్‌తో పాటు త‌న‌నూ అరెస్ట్ చేశార‌ని వెల్ల‌డి
నేడు (ఆగ‌స్ట్ 6) తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తి ప్ర‌దాత ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ జ‌యంతి. ఈ సందర్భాన్ని పుర‌స్క‌రించుకుని జ‌య‌శంక‌ర్ విగ్ర‌హాలు, ఫొటోల‌కు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. పార్టీల‌కు అతీతంగా నేత‌లంతా శ‌నివారం ఉద‌యం నుంచే జ‌య‌శంకర్‌కు నివాళి అర్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌తో త‌మకు ఉన్న అనుబంధాన్ని నెమ‌రువేసుకుంటున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా జ‌య‌శంక‌ర్‌కు నివాళి అర్పిస్తూ ఆయ‌న‌తో క‌లిసి తాను దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

జ‌య‌శంక‌ర్‌తో క‌లిసి తాను తెలంగాణ కోసం నినాదాలు చేస్తున్న సంద‌ర్భంగా తీసిన ఫొటోను కేటీఆర్ పంచుకున్నారు. హ‌న్మకొండ‌లో 2009 న‌వంబ‌ర్ 29న జ‌య‌శంకర్ ఇంటిలో ఈ ఫొటో తీశార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్‌ను అలుగునూర్ వ‌ద్ద పోలీసులు అరెస్ట్ చేయ‌గా... దానికి నిర‌స‌న‌గా తాను జ‌య‌శంకర్‌తో క‌లిసి నినదించాన‌ని, ఆ త‌ర్వాతి రోజు త‌మ‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశార‌ని చెప్పారు. త‌న‌ను వ‌రంగ‌ల్ జైలుకు త‌ర‌లించిన పోలీసులు జ‌య‌శంక‌ర్‌ను మాత్రం ఖ‌మ్మం జైలుకు త‌ర‌లించార‌ని కేటీఆర్ వివ‌రించారు. త‌న‌కు ఇష్ట‌మైన ఫొటోల్లో ఇదీ ఒక‌టి అంటూ ఆయ‌న తెలిపారు.


More Telugu News