బీ విటమిన్లు.. ఒక్కో విటమిన్ ఒక్కో పనికి

  • మన శరీరంలోని కణాలు, జీవక్రియలకు బీ విటమిన్లు ఎంతో అవసరం
  • ఆహారం ద్వారా వీటి లోపం లేకుండా చూసుకోవాలి
  • మెదడు, నాడీ ఆరోగ్యానికి ఇవి కీలకం
మనం ఉదయం నిద్ర లేచింది మొదలు.. తిరిగి రాత్రి విశ్రమించేంత వరకు అలుపెరుగకుండా పనిచేసే వాటిల్లో మస్తిష్కం ఒకటి. ఇది చురుగ్గా, ఆరోగ్యంగా పనిచేయాలంటే..? కావాల్సిన పోషకాలు అందేలా చూసుకోవాలి. మన బ్రెయిన్ కార్యకలాపాలకు బీ విటమిన్లు కీలకం.

డిప్రెషన్, డిమెన్షియా, మానసిక వైకల్యం, మానసిక పరమైన సమస్యలు అన్నీ కూడా బీ విటమిన్ల లోపం వల్ల వచ్చేవేనని వేన్ స్టేట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా పెద్ద వయసులో, సరైన పోషకాహారం తీసుకోని వారిలో ఇవి కనిపిస్తాయని పరిశోధకులు అంటున్నారు.

విటమిన్ బీ1
దీనినే థయమిన్ అంటారు. మన కణాలు ప్రాథమిక విధులకు, జీవక్రియల నిర్వహణకు ఇది కావాలి. పోషకాలు శక్తిగా మారేందుకు ఇది అవసరం. మన శరీర జీవక్రియల్లో అత్యంత చురుకైన పాత్ర మెదడుది. కనుక థయమిన్ లోపం లేకుండా చూసుకోవాల్సిందే.

విటమిన్ బీ2
దీనిని రిబోఫ్లావిన్ గా చెబుతారు. మన కణాలకు ఇది సాయం చేసే ఎంజైమ్. మన శరీరం, మెదడులో కీలక చర్యలకు సహాయకారిగా రిబోఫ్లావిన్ పనిచేస్తుంది. కణాల వృద్ధికి, శక్తి తయారీకి, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి అవసరం.

విటమిన్ బీ3
దీన్ని నయసిన్ అంటారు. 400కు పైగా ఎంజైమ్ లతో కలసి శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్, ఫ్యాట్ తయారీలో పాత్ర పోషిస్తుంది. ఇదొక యాంటీ ఆక్సిడెంట్, శరీరంలో అధికంగా ఉన్న ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. 

విటమిన్ బీ5
దీన్ని పాంటోథెనిక్ యాసిడ్ అని అంటారు. కోఎంజైమ్ ఏ అనే మాలిక్యులర్ కాంపౌండ్ తయారీకి అవసరం. శరీరంలో ఎంజైమ్ ల ఉత్పత్తి, కొవ్వులను విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చేందుకు అవసరం. మన మస్తిష్కం కూడా ఫ్యాట్ తోనే ఉంటుంది. కనుక మెదడు ఆరోగ్యానికి బీ5 అవసరం.

విటమిన్ బీ6
దీన్ని పైరిడాక్సిన్ అని అంటారు. వ్యాధి నిరోధకతలో దీని అవసరం ఎంతో ఉంది. కేన్సర్ల నిరోధకంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఎన్నో పరిశోధనలు గుర్తించాయి. మెదడు ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తికి కీలకమైన ఎన్నో రసాయన చర్యలకు పైరిడాక్సిన్ అవసరం. ఇది లోపిస్తే ఆయా చర్యలు సమగ్రంగా జరగవు. 

విటమిన్ బీ7
దీన్ని బయోటిన్ అంటారు. శరీరమంతటికీ కణాల మధ్య సమాచారానికి ఇది అవసరం. న్యూరోట్రాన్స్ మీటర్ల ఆరోగ్యానికి ఇది కావాలి. శిరోజాల ఆరోగ్యానికి కూడా ఇది సాయపడుతుంది.

విటమిన్ బీ9
దీన్ని ఫొలేట్ అంటారు. మెదడు, నాడీ సంబంధిత ఆరోగ్యానికి ఇది కీలకంగా పనిచేస్తుంది. కణాల్లోని వ్యర్థాల తొలగింపునకు కూడా అవసరం. 

విటమిన్ బీ12
దీన్ని కొబాలమిన్ అని పిలుస్తారు. డీఎన్ఏ, ఎర్ర రక్త కణాలకు ఇది కావాలి. నెర్వస్ సిస్టమ్ సాఫీగా పనిచేసేందుకు ఇది కావాలి. గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే హోమోసిస్టీన్ ను విచ్ఛిన్నం చేయడానికి అవసరం.  

బీ విటమిన్లు లభించే ఆహారం
రోజుకో గుడ్డు తీసుకోవడం వల్ల బీ బిటమిన్ల లోపం లేకుండా చూసుకోవచ్చు. అలాగే, పెరుగులో బీ2, బీ12 లభిస్తాయి. సాల్మన్ చేపల్లోనూ బీ2, బీ3, బీ6, బీ12 లభిస్తాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ లో బీ5 లబిస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు కూడా తీసుకోవాలి.


More Telugu News