కనిమొళికి సుప్రీంకోర్టులో ఊరట

  • 2019 ఎన్నికల్లో కనిమొళి విజయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్
  • హైకోర్టు విచారణను నిలుపుదల చేయాలని సుప్రీంను ఆశ్రయించిన కనిమొళి
  • మద్రాస్ హైకోర్టు విచారణపై స్టేను కొనసాగిస్తూ సుప్రీం ఆదేశాలు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి, తూత్తుకుడి ఎంపీ కనిమొళికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2019లో లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె విజయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు విచారణ జరపకుండా నిలుపుదల చేయాలని కోరుతూ 2020లో సుప్రీంకోర్టును కనిమొళి ఆశ్రయించారు. అప్పట్లో ఆమె విన్నపాన్ని సుప్రీంకోర్టు మన్నించింది. హైకోర్టు విచారణపై స్టే విధించింది. 

ఈ నేపథ్యంలో మరోసారి ఇదే అంశంపై సుప్రీంలో వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. కనిమొళి తరపున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదనలను వినిపించారు. స్పష్టమైన మెజార్టీతో తన క్లయింట్ ఎన్నికల్లో గెలిచారని... దీనిపై విచారణ జరపడం వల్ల ఆమె మనస్తాపానికి గురవుతారని కోర్టుకు తెలిపారు. అంతేకాక... ఎన్నికల్లో గెలుపొందిన ఆమెకు తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు విచారణపై గతంలో విధించిన స్టేను కొనసాగిస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది.


More Telugu News