అందుకే ఇవాళ కాంగ్రెస్ నేతలు నల్లదుస్తులతో నిరసన తెలిపారు: అమిత్ షా

  • ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఛలో రాష్ట్రపతి భవన్
  • నల్ల దుస్తులు ధరించిన కాంగ్రెస్ అగ్రనేతలు
  • వారు రామమందిరానికి వ్యతిరేకమన్న అమిత్ షా
  • అయోధ్యలో శంకుస్థాపన జరిగి ఏడాది అయిందని వెల్లడి
ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు దేశరాజధాని ఢిల్లీలో నల్లదుస్తులతో నిరసనలు తెలపడం తెలిసిందే. ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ నేడు ఛలో రాష్ట్రపతి భవన్ కార్యాచరణ చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల నిరసనలు ఉద్రిక్తతలను కలుగజేశాయి. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ, కాంగ్రెస్ నిరసనలకు కొత్త భాష్యం చెప్పారు. 

గతేడాది అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజు నేడని, అందుకే కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలిపారని, వారి నిరసనలు రామాలయానికి వ్యతిరేకంగానే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఈ నిరసనలే నిదర్శనమని అమిత్ షా విమర్శించారు. 

"కోర్టులో నమోదైనే కేసులకు వ్యతిరేకంగానే ఈ నిరసనలు. ఎందుకు ప్రతిరోజూ నిరసనలు తెలుపుతున్నారు? చూస్తుంటే కాంగ్రెస్ ఏదో రహస్య అజెండాతో పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది. వారు తమ బుజ్జగింపు రాజకీయాలకు కొత్త ముసుగు తొడిగారు. ఇవాళ ఈడీ ఎవరికీ సమన్లు కూడా జారీచేయలేదే! ఎవరినీ ప్రశ్నించలేదే! ఈడీ ఎక్కడా దాడులు చేసిన దాఖలాలు కూడా లేవే! మరి నేడు కాంగ్రెస్ ఏం ఆశించి ధర్నా చేపట్టిందో అర్థంకావడంలేదు. 

ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామజన్మభూమి వద్ద మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాది అయ్యింది. 550 ఏళ్ల జటిల సమస్యలకు శాంతియుత పరిష్కారం చూపారు. దేశంలో ఎక్కడో ఒకచోట హింసను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పించారు. కాంగ్రెస్ కు చెప్పేది ఒక్కటే... బుజ్జగింపు విధానం దేశానికి, కాంగ్రెస్ కు మంచిది కాదు" అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.


More Telugu News