మాది జావెలిన్ కుటుంబం... నీరజ్ చోప్రాతో స్నేహంపై పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ వ్యాఖ్యలు

  • 2016 నుంచి నీరజ్ చోప్రా, అర్షద్ ల మధ్య స్నేహం
  • నాడు దక్షిణాసియా క్రీడల్లో పరిచయం
  • కామన్వెల్త్ క్రీడలకు గాయంతో నీరజ్ చోప్రా దూరం
  • స్నేహితుడ్ని మిస్సవుతున్నానన్న అర్షద్
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయంతో కామన్వెల్త్ క్రీడలకు దూరమైన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ స్పందించాడు. కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ చోప్రాతో పోటీ పడే అవకాశాన్ని మిస్ అయ్యానని తెలిపాడు. 

ఇటీవల ముగిసిన వరల్డ్ చాంపియన్ షిప్ లో అర్షద్ నదీమ్ బల్లేన్ని 88.13 మీటర్లు విసిరి ఐదోస్థానంలో నిలిచాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ఫైనల్ చేరిన తొలి పాకిస్థానీగా రికార్డు సృష్టించాడు. కాగా, తాజాగా కామన్వెల్త్ క్రీడల్లోనూ అర్షద్ నదీమ్ పోటీపడుతున్నాడు. ఈ నేపథ్యంలో, నీరజ్ చోప్రాతో తన స్నేహానుబంధంపై స్పందించాడు. 

"నీరజ్ భాయ్ నా సోదరుడు. మాది జావెలిన్ కుటుంబం. కామన్వెల్త్ గేమ్స్ లో అతడ్ని మిస్సవుతున్నాను. దేవుడు అతడికి ఆరోగ్యం కలిగించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే అతడితో పోటీపడతానని ఆశిస్తున్నా" అని వివరించాడు. 

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణంతో నీరజ్ చోప్రా పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అయితే, నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ మధ్య స్నేహం ఇప్పటిదికాదు. 2016లో గువాహటిలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో వీరి మధ్య చెలిమి ఏర్పడింది. ఆ పోటీల్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకోగా, అర్షద్ కాంస్యం దక్కించుకున్నాడు.


More Telugu News