'బీజేపీ'కి కొత్త అర్థం చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

  • బీజేపీ నేత సత్యకుమార్ పై ధ్వజం
  • సీఎం జగన్ పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం
  • అసత్యకుమార్ అనే పేరు సరిపోతుందని వ్యాఖ్యలు
  • 'బాబు జనతా పార్టీ'గా మార్చేశారని ఎద్దేవా  
బీజేపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తే ఎల్లో మీడియా అత్యధిక కవరేజీ ఇస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే అమరావతిలో పాదయాత్ర ముగింపు సభలో బీజేపీ నేత సత్యకుమార్ ఇష్టానుసారం మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు చేశారని మండిపడ్డారు. ఆయనకు సత్యకుమార్ అనే పేరు కంటే అసత్యకుమార్ అనే పేరు సరిగ్గా సరిపోతుందని అన్నారు. 

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ టీడీపీకి సహకరించాలన్న ఉద్దేశంతో బీజేపీలో చేరారని, సత్యకుమార్ ఎప్పుడూ సుజనా, సీఎం రమేశ్ లకు వంతపాడుతుంటాడని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. వీళ్లంతా కలిసి ఏపీలో బీజేపీని 'బాబు జనతా పార్టీ'గా మార్చేశారని విమర్శించారు. చంద్రబాబు తన బినామీలకు నష్టం కలుగకుండా, అమరావతి పాట పాడుతూ కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చి విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబుకు సత్యకుమార్ వంటివాళ్లు మద్దతుగా నిలుస్తూ అమరావతి భజనలో భాగస్వాములవుతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. 

ఏపీలో బీజేపీ అనేది కనిపించకుండా 'బాబు జనతా పార్టీ'గా మార్చేశారని అన్నారు. అమరావతిలో ఈ అసత్యకుమార్ కు, ఆయన అనుచరులకు కూడా భూములు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగత అజెండాతో సీఎంపై అవాకులుచెవాకులు పేలితే సహించేది లేదని గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. అసత్యకుమార్ మీడియా దృష్టిని ఆకర్షించాలనో, మరెవరి మెప్పు పొందడం కోసమో తమపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. 


More Telugu News