తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు చేపట్టడంపై అమెరికా ఆగ్రహం

  • తైవాన్ లో స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన
  • తైవాన్ చుట్టూ 6 ప్రాంతాల్లో చైనా విన్యాసాలు
  • చైనాది రెచ్చగొట్టే చర్యేనన్న అమెరికా విదేశాంగ మంత్రి
  • తమను ఎవరూ అడ్డుకోలేరన్న నాన్సీ పెలోసీ
తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించడం పట్ల చైనా ప్రతీకార చర్యలకు దిగడం తెలిసిందే. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో సైనిక చర్యలు చేపట్టి, ఆ చిన్న ద్వీపదేశాన్ని దాదాపు దిగ్బంధనం చేసింది. తైవాన్ జలసంధిపైకి ఏకంగా 11 డాంగ్ ఫెంగ్ బాలిస్టిక్ మిసైళ్లను సంధించి తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. చైనా చర్యలతో అనేక వాణిజ్యనౌకలు, విమానాలు తమ ప్రయాణ రూట్ ను మార్చుకోవాల్సి వచ్చింది. తైపే విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 50 అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. 

ఈ నేపథ్యంలో, చైనా చర్యలను అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. చైనాది ముమ్మాటికి రెచ్చగొట్టే చర్య అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. చైనా చర్యలు తైవాన్ ను, దాని పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

తాజాగా, జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్ లో పర్యటించకుండా తమను ఎవరూ అడ్డుకోలేరని చైనాకు స్పష్టం చేశారు. తైవాన్ ను అడ్డుకోగలరేమో కానీ, మమ్మల్ని అడ్డుకోలేరు అంటూ ఉద్ఘాటించారు

తైవాన్ లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నదే అమెరికా ప్రయత్నం అని, కానీ తైవాన్ ను ఒంటరిని చేయాలని చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తైవాన్ ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా అడ్డుకుంటోందని, తైవాన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో చేరకుండా నిలువరించిందని నాన్సీ పెలోసీ విమర్శించారు. తైవాన్ ను ఏకాకిని చేసే ఏ ప్రయత్నాన్నీ అమెరికా చూస్తూ ఊరుకోదని తమ వైఖరిని చాటిచెప్పారు.


More Telugu News