రుణాలు తీసుకున్న వారిపై పిడుగు.. రేట్లను అరశాతం పెంచిన ఆర్బీఐ

  • 5.4 శాతానికి చేరిన రెపో రేటు
  • ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్బీఐ నిర్ణయం
  • మే ముందు వరకు ఇది 4 శాతమే
  • మూడు నెలల్లో 1.4 శాతం మేర అధికం
  • ఈ మేరకు రుణాలపై అధికంగా చెల్లించాల్సిందే
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటును అర శాతం (50 బేసిస్ పాయింట్లు) పెంచుతున్నట్టు ఈ రోజు ప్రకటన చేసింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. కరోనా రాక ముందున్న 5.15 శాతాన్ని దాటిపోయింది. ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధిలో నియంత్రించేందుకు, అదే సమయంలో వృద్ధికి మద్దతునిస్తూ సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. 

ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో నియంత్రించాలన్నది ఆర్బీఐ ముందున్న లక్ష్యం. కానీ అది ఇప్పుడు 7 శాతం స్థాయిలో చలిస్తోంది. సర్దుబాటు విధానం అన్నది అవసరమైతే వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు కల్పించేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్ల తగ్గింపు అవకాశాలు లేవు. పైగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రేట్లను పెంచక తప్పని స్థితి. దీంతో సర్దుబాటు వైఖరి నుంచి బయటకు రానుంది. ఫలితంగా కరోనా సమయంలో వృద్ధికి మద్దతుగా వ్యవస్థలోకి జొప్పించిన లిక్విడిటీని ఆర్బీఐ క్రమంగా వెనక్కి తీసుకోనుంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందన్న గత అంచనాలను కొనసాగించింది. తదుపరి ఆర్థిక సంవత్సరం 2023-24 మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాలను కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును పెంచడం ఇది మూడోసారి. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది మే నెలలో ఒకసారి, జూన్ లో ఒకసారి, ఇప్పుడు ఆగస్ట్ లో మరో విడత కలిపి మొత్తం మీద 1.40 శాతం మేర పెరో రేటును ఆర్బీఐ పెంచింది. 

అంటే కేవలం మూడు నెలల వ్యవధిలో పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చినట్టు అర్థం అవుతోంది. దీంతో రుణాలు తీసుకున్న వారికి ఇంతే మేర భారం పడనుంది. నెలవారీగా చెల్లిస్తున్న రుణాల ఈఎంఐలు కనీసం 15 శాతం వరకు పెరగొచ్చు. ఇది సామాన్యులకు భారం కానుంది. ఈఎంఐ పెంచి చెల్లించలేమని చెబితే, బ్యాంకులు రుణ కాలవ్యవధిని పెంచేందుకు అంగీకరిస్తాయి.


More Telugu News