మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: తైవాన్ అధ్యక్షురాలు

  • తైవాన్ ఘర్షణను పెంచదంటూ ప్రకటన
  • భద్రతను కాపాడుకుంటామని స్పష్టీకరణ
  • చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో స్పందించిన తైవాన్
తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ చైనాకు గట్టి సందేశం పంపారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో ఒక రోజు పర్యటించి, వెళ్లడం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తున్న చైనా తైవాన్ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ చైనాకు హెచ్చరిక చేశారు. తాము వివాదాన్ని పెంచబోమని స్పష్టం చేస్తూ.. అదే సమయంలో తైవాన్ తన సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుందని ప్రకటించారు. 

‘‘చైనా తైవాన్ చుట్టుపక్కల సైనిక విన్యాసాలు చేపట్టింది. కారణం మేరకు స్పందించాలని, నిగ్రహం పాటించాలని బీజింగ్ ను కోరుతున్నాం. తైవాన్ ఘర్షణను పెంచదు. కానీ, మా సార్వభౌమత్వం, భద్రత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం’’ అని ఇంగ్ వెన్ ప్రకటించారు.

తైవాన్ తన భూభాగంలోనిది అని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. కానీ, తమది స్వతంత్య్ర దేశమని తైవాన్ గుర్తు చేస్తోంది. దీంతో తైవాన్ కు అమెరికా సహా పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇది చైనాకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ప్రాదేశిక భూభాగం తైవాన్ విషయంలో వేలు పెట్టొద్దంటూ అమెరికా సహా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ, చైనా ఇప్పటికే సంకేతం పంపించింది. ద్వీప దేశమైన తైవాన్ ను తన భూభాగంతో తిరిగి కలుపుతామని, అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా లోగడే ప్రకటించింది. 



More Telugu News