అగ్నిపథ్: ఆర్మీలో చేరికకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

  • 'అగ్నిపథ్' పథకం ద్వారా త్రివిధ దళాల్లో నియామకాలు 
  • వచ్చే నెల 3వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
  • అక్టోబరు 15 నుంచి 31 వరకు సూర్యాపేటలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో భాగంగా ఆర్మీలో చేరికల కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే నెల (సెప్టెంబరు) 3వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సికింద్రాబాద్ ఆర్మీ అధికారులు తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జాయిన్ఇండియన్ఆర్మీ.ఎన్ఐసీ.ఇన్ (www.joinindianarmy.nic.in) వెబ్‌సైట్ నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అక్టోబరు 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 23 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఇక అర్హతల విషయానికి వస్తే అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగంలో ఉద్యోగాలకు పదో తరగతి పాసై ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 15 నుంచి 31వ తేదీ వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.


More Telugu News